December 2, 2012

బాబుకు వీరభద్రులు!


కన్నులు మూయరు.. గన్నులు వీడరు
కంటికి రెప్పలా బాబు భద్రత
ఆయనతో పాటే నిరంతర పాదయాత్ర
సరిహద్దులతో సంబంధం లేకుండా భద్రత
భద్రతా సిబ్బందిలో ఎన్ఎస్‌జీ, స్థానిక పోలీసులు, పర్సనల్ సెక్యూరిటీ
విధి నిర్వహణలో భాగంగా వేల కిలోమీటర్ల నడక

(బాబు పాదయాత్ర నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధులు) 'వస్తున్నా.. మీకోసం' అంటూ ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు! 'మీ కోసమే వస్తున్నాం' అంటూ ఆయనతోపాటు మరికొంతమంది కూడా పాదయాత్ర చేస్తున్నారు! ఒకరు ఇద్దరు కాదు.. వందమందికిపైగానే! వీరంతా టీడీపీ కార్యకర్తలు కాదు! రాజకీయ నాయకులు అసలే కాదు. వారికి అసలు రాజకీయాలే అక్కర్లేదు కూడా!!

కానీ, విధి నిర్వహణలో భాగంగా వారు పాదయాత్ర చేయాల్సి వస్తోంది! వారే.. చంద్రబాబు భద్రతా సిబ్బంది! కన్నులు మూయరు! గన్నులు వీడరు! నిరంతరం తమ నేతను కంటికి రెప్పలా కాపాడతారు! బాబుకు వారే 'వీరభద్రులు'! దాదాపు రెండు నెలలుగా చంద్రబాబు వెంట నడుస్తూ.. పాదయాత్రలో భాగమైన భద్రతా సిబ్బందిని 'ఆంధ్రజ్యోతి' పరిశీలించింది!

చంద్రబాబు అనంతపురంలో పాదయాత్ర చేస్తుంటే ఆ జిల్లా నేతలు ఆయనను అనుసరించారు. జిల్లా సరిహద్దులు దాటగానే వారు కనుమరుగయ్యారు. ఆ తర్వాత బాబును కర్నూలు జిల్లా నేతలు అనుసరించారు. కానీ, జిల్లాలూ సరిహద్దులతో సంబంధం లేకుండా పాదయాత్ర యావత్తూ నడవడమే కాకుండా చంద్రబాబును కంటికి రెప్పలా చూసుకునేది మాత్రం భద్రతా సిబ్బందే! కేజీలకొద్దీ బరువుండే తుపాకీలను చేతపట్టుకుని నిరంతరం వారు చంద్రబాబు చుట్టే ఉంటారు. నెలల తరబడి కుటుంబాల ముఖాలను కూడా చూడరు.

ఏదో ఒక ప్రయోజనం ఉంటే తప్ప చిన్న పని గురించి కూడా ఆలోచించని నేటి రోజుల్లో వారి అంకితభావం నిజంగా వెల కట్టలేనిదే! చంద్రబాబు భద్రతా సిబ్బందిలో మూడు రకాల సిబ్బంది ఉన్నారు! వీరిలో మొదటి రకం ఎన్ఎస్‌జీ బ్లాక్ క్యాట్ కమెండోలు! రెండోది.. స్థానిక పోలీసులు! మూడోది, చంద్రబాబు పర్సనల్ సెక్యూరిటీ! ఎన్ఎస్‌జీ కమెండోలు ఆరుగురు ఉంటే.. బాబు పర్సనల్ సెక్యూరిటీ మరో తొమ్మిదిమంది ఉంటారు! దాదాపు 120 మంది వరకు స్థానిక పోలీసులు పాల్గొంటారు. వీరందరూ ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ల (సీఎస్‌వో) నియంత్రణలో ఉంటారు.

వారే.. డీఎస్పీ స్థాయికి చెందిన నగేశ్, ఏఎస్పీ స్థాయికి చెందిన నాగేంద్ర! వీరు వారానికోసారి డ్యూటీ మారతారు. ఆ వారం రోజులూ సీఎస్‌వోలు చంద్రబాబు వెంట పూర్తిగా నడుస్తూనే ఉంటారు. స్థానిక ఎస్పీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భద్రతను పర్యవేక్షిస్తారు. బసలో చంద్రబాబు బస్సులోకి వెళ్లిపోయిన తర్వాత స్థానిక పోలీసులు, పర్సనల్ సెక్యూరిటీతో సమీక్షిస్తారు. తర్వాతి రోజు రూట్ మ్యాప్, భద్రతా చర్యలు, సవాళ్లు తదితరాలను సమీక్షిస్తారు.

బ్లాక్ క్యాట్స్..
ఒంటినిండా నల్లటి దుస్తులు, భుజాలపై అత్యాధునిక ఆయుధాలు. రాత్రీ పగలూ తేడా లేకుండా విధులు! ఇదీ బ్లాక్ క్యాట్ కమెండోల ప్రత్యేకత. దేశంలోని ఏ ప్రాంతంలో విధులు కేటాయించినా కంటికి రెప్పలా భద్రతపై దృష్టి సారించడం వీరి నైజం. బాబు భద్రతా దళంలో 15 మంది కమెండోలు ఉన్నారు. వీరు మూడు రోజులకోసారి విధులు మారుతుంటారు. విడతల వారీగా ఏడుగురు చొప్పున రోజూవారీ విధులు నిర్వహిస్తుంటారు. వీరిలో ఒకరు ఇన్‌స్పెక్టర్ అయితే, మిగిలినవారు కమాండర్లు. ఇన్‌స్పెక్టర్ భద్రతను పర్యవేక్షిస్తే ఒకరు ఆ రోజంతా పూర్తి విశ్రాంతిలో ఉంటారు. మిగిలినవారు చంద్రబాబును అనుసరిస్తారు. వీరిలో ఒకరు ప్రతి గంటకూ మారుతుంటారు.

మారిన వ్యక్తి వాహనంలో విశ్రాంతి తీసుకుంటారు. కమాండర్లు ప్రతి గంటకూ హైదరాబాద్‌లోని ఎస్పీకి నివేదిక పంపిస్తారు. దానిని వారు ఢిల్లీకి పంపుతారు. యాత్ర వివరాలు, సమస్యలు, సవాళ్లు అందులో పేర్కొంటారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఎక్కడ విధులు నిర్వర్తించినా నెలల తరబడి వీరు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఏడాదిలో మూడు నెలలు మాత్రమే వీరికి సెలవులు. ఆ సెలవుల్లోనే కుటుంబాలతో గడపాల్సి ఉంటుంది.

స్థానిక పోలీసులు
స్థానిక పోలీసుల్లో దాదాపు 120 మంది వరకు చంద్రబాబు భద్రతా దళంలో ఉంటారు. వీరు రోప్ పార్టీ.. ఎస్కార్టు.. బాంబు డిస్పోజల్ స్వ్కాడ్, రోడ్ ఓపెనింగ్ పార్టీ.. కూంబింగ్ పార్టీ అని పలు రకాలు. ఏ జిల్లాకు ఆ జిల్లా పోలీసులనే ఇందుకు వినియోగిస్తారు. సరిహద్దు మారగానే చంద్రబాబు పాదయాత్ర ప్రవేశించే జిల్లా పోలీసులు ఆయన భద్రత బాధ్యతను తీసుకుంటారు. పాదయాత్రకు రెండు కిలోమీటర్ల ముందు ఒక బృందం వెళుతుంది.

కూంబింగ్‌లో భాగంగా రోడ్డు పక్క నిశితంగా పరిశీలిస్తుంది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై చంద్రబాబును చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడుతున్నప్పుడు రోప్ పార్టీ క్రియాశీలంగా వ్యవహరిస్తుంది. తోసుకొస్తున్న ప్రజలను అదుపు చేస్తూ, పాదయాత్రకు మార్గాన్ని సుగమం చేస్తూ.. ఆయన భద్రతను కంటికి రెప్పలా కాపాడుతూ ఏకకాలంలో వివిధ విధులను వీరు సమర్థంగా నిర్వర్తిస్తారు.

కాలి మడమకు ఇబ్బంది వచ్చిన తర్వాత చంద్రబాబు రోడ్డు పక్కన ఉన్న మట్టిరోడ్డుపై పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పూర్తి బహిరంగంగా ఉండడంతో సెక్యూరిటీ వారికి మరింత సమస్యగా మారింది. ఇక, చంద్రబాబును కలిసి మాట్లాడాలని, ఆయనతో కరచాలనం చేయాలని వచ్చే పార్టీ శ్రేణులు, కార్యకర్తల నుంచి తిట్లు, శాపనార్థాలు మామూలే!

పర్సనల్ సెక్యూరిటీ
చంద్రబాబు పర్సనల్ సెక్యూరిటీలో తొమ్మిదిమంది ఉంటారు. ముగ్గురు సెక్యూరిటీ ఆఫీసర్లు కాగా ఆరుగురు గార్డులు. విసుగూ విరామం లేకుండా వీరు నిరంతరం చంద్రబాబు వెంటే నడుస్తుంటారు. ఈ బృందం మూడు రోజులకోసారి మారుతుంది. చంద్రబాబు పిలిస్తే తప్ప ఎవరినీ ఆయన సమీపానికి రానివ్వరు. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే నైట్ క్యాంపులోకి అనుమతిస్తారు.

అయితే, చంద్రబాబు పొలాల్లోకి వెళ్లడం, ప్రజలతో మమేకం కావడంతో భద్రత వీరికి కాస్త సవాలుగానే మారుతోంది. ఇక, చంద్రబాబు బస చేసినప్పుడు భద్రత వీరికి మరొక సవాలు. నలుదిక్కులా కిలోమీటరు పరిధిని వీరు ముందుగానే తమ నియంత్రణలోకి తీసుకుంటారు. రాత్రంతా పెట్రోలింగ్, నిశిత పరిశీలన తప్పనిసరి. అది నక్సల్ ప్రభావిత ప్రాంతమా? నక్సల్ సానుభూతిపరులు ఉన్నారా? అని ఆరా తీస్తారు. నక్సల్ ప్రభావిత ప్రాంతమైతే వీరి బాధ్యత రెట్టింపు అవుతుంది. నైట్ టీమ్‌లో స్థానిక పోలీసులు కూడా ఉంటారు. వీరిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, 20 మంది కానిస్టేబుళ్లు ఉంటారు.

భద్రతే మాకు ముఖ్యం
నాగేంద్ర, చంద్రబాబు సీఎస్‌వో

చంద్రబాబు పాదయాత్రలో ఇప్పటి వరకు ఏ జిల్లాలోనూ సమస్య రాలేదు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అధికారులు చక్కగా సహకరించారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నాం. రాబోయే తెలంగాణ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. కనక మరింత అప్రమత్తంగా ఉండాలి. ఉంటున్నాం కూడా. పాదయాత్రలో ప్రజలు, నాయకుల నుంచి మాకు ఛీత్కారాలు, శాపనార్థాలు తప్పడం లేదు. అయినా, వీఐపీల భద్రతే మాకు ముఖ్యం. అదే సమయంలో, పాదయాత్ర ఉద్దేశం దెబ్బతినకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాం.