December 2, 2012

అదో దొంగల పార్టీ:చంద్రబాబు


అందులో చేరే వారంతా ముందు జైలుకెళతారు
అంతా డబ్బు మాయ
బెల్లం చుట్టూ మూగే ఈగలవి
వైసీపీలోకి వలసలపై చంద్రబాబు నిప్పులు
ఎస్సీ నిధుల మళ్లింపు పాపం వైఎస్‌దే
రాష్ట్రాన్ని దివాలా తీయించాడు

నిజామాబాద్, డిసెంబర్ 1 : " వైసీపీ.. దొంగల పార్టీ. ఏదైనా మంచిపని చేయాలనుకుంటే మనం దేవుణ్ణి పూజిస్తాం. కానీ, ఆ పార్టీలోకి వెళ్లేవారు జైలుకు వెళ్లొచ్చి ఆ తరువాత ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అంతా డబ్బు మాయ. బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడే ఉంటాయి'' అంటూ 'జంప్ జిలానీ'లపై టీడీపీ అధినేత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎస్సీల నిధులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎసరు పెట్టినట్టు చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలను మోసాలు చేసే పార్టీలను తరిమి కొట్టాలని, తెలుగుదేశం పార్టీకి 42 ఎంపీ సీట్లు, అన్ని అసెంబ్లీ సీట్లలో గెలిపిస్తే రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తానని, కేంద్రంతో కొట్లాడి గ్యాస్ ధరలు కూడా తగ్గిస్తానని ప్రకటించారు.

నిజామాబాద్ జిల్లాలో నాలుగోరోజైన శనివారం మైలారం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్, బీర్కూర్‌లలో ఏర్పాటు చేసిన సభల్లోనూ, మీడియాలోనూ జగన్, కేసీఆర్ పార్టీల తీరును తూర్పారబట్టారు. అవినీతి సొమ్ముతో టీవీ చానల్, పేపర్ పెట్టి అరాచకాలు చేస్తున్నారని, తప్పుడు రాతలు రాసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అలాంటివారు తమనేమీ చేయలేరని హెచ్చరించారు. వైఎస్ వల్లనే రాష్ట్రం దివాలా తీసిందని విమర్శించారు. పేదల సొమ్ము దోచుకున్న వారే రైతుల రుణ మాఫీ వద్దంటున్నారని మండిపడ్డారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కోసం 2002లోనే జీవో తీసుకొచ్చామని గుర్తు చేశారు. టీడీపీ చేపట్టిన ఈ పథకాన్ని మరింత మందికి వర్తింపజేయడం తప్ప వైఎస్ చేసిందేమి లేదని అన్నారు. వైఎస్ హయాంలోనే వ్యవస్థ పూర్తిగా పతనమైందని, ఇప్పుడు రైతులకు నాలుగు గంటలు కాదుకదా ఒక్క గంట కూడా కరెంటు రావడంలేదని ఆరోపించారు. అవినీతి, అసమర్థ కాంగ్రెస్ పాలనే దీనికి కారణమన్నారు. ప్రజల సమస్యలు తెలియని కిరికిరి.. ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడని, ఇలాంటి అసమర్థులు ఎక్కడా ఉండరని దుయ్యబట్టారు.

రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం వారితో చెలగాటం ఆడుతోందని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ తన కనుసన్నల్లో ఉందంటూ ప్రజలను కేసీఆర్ మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా చేసినా, ఆయన పార్టీ నేతలు రాష్ట్ర మంత్రులుగా ఉండి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమిటని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా పట్టించుకోని కేసీఆర్..తన కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దని కోరారు.

కాలు అడ్డంపెడితే గోదావరి నీళ్లు వస్తాయని చెప్పిన కే సీఆర్‌కు, అలా చేయొద్దని ఎవరైనా చెప్పారా అని నిలదీశారు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం ప్రధాని పదవినే వదులుకున్నానని, గుజ్రాల్‌ను ప్రధాన మంత్రి చేసింది తానేనని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. ఉపాధి హామీని అనుసంధానం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తానని భరోసా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

"మాది బడుగు, బలహీన వర్గాల పార్టీ. ఉప ప్రణాళికను సమర్థిస్తున్నాం. అయితే, ఆ నిధులను ఎస్సీ,ఎస్టీ నివాస ప్రాంతాల అభివృద్ధికే కేటాయించాలి. దీనికోసం నోడల్ ఏజన్సీలను ఏర్పాటు చేయాలి. నిధుల వినియోగంపై పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్‌కు కాక అంబుడ్స్‌మెన్‌లకు అప్పగించాలి. ఉప ప్రణాళిక చట్టానికి పదేళ్ల కాల పరిమితి పెట్టారు. ఈ కొద్ది కాలంలో దళితులు అభివృద్ధి చెందుతారా? దీనిపై ప్రభుత్వ వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఖర్చుకాని నిధులను తిరిగి ఖర్చుచేసేలా చూడాలే గానీ, వేరే పథకాలకు మళ్లించరాదు.

అలాగే.. నిధుల కేటాయింపులో ఏ,బీ,సీ,డీ వర్గీకరణకు ప్రాధాన్యతనివ్వాలి'' అని సూచించారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల మళ్లింపు పాపం వైఎస్‌దేనని దుయ్యబట్టారు. " వైఎస్ అధికారంలో ఉండగా, 21వేల 200 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ నిధులను పక్కదారి పట్టించారు. ఔటర్ రింగ్ రోడ్, హుసేన్ సాగర్ ఆధునికీకరణ, అభయారణ్యాల నిర్మాణాలకు ఆ నిధులను వెచ్చించారు 13వేల 90కోట్ల నిధులను ప్రణాళికలో పెట్టి కేవలం పదివేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1 కోటి 23 లక్షల మంది దళితులుండగా, 64 లక్షల మంది మాదిగ ఉప కులాల వారు ఉన్నారని, వారికి న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ తప్పదని స్పష్టం చేశారు.

తన హయాంలో వర్గీకరణ అమలుచేసి.. 24వేల 500 ఉద్యోగాలను మాదిగ ఉప కులాల సోదరులకు అందించినట్టు చెప్పుకొచ్చారు. వైఎస్ ముఖ్యమంత్రి కాగానే వర్గీకరణను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుంటోందన్నారు. సామాజిక న్యాయం టీడీపీ బాధ్యత అని, అందుకే ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారీటీ డిక్లరేషన్ ప్రకటించామని గుర్తుచేశారు. రాష్ట్రపతి పదవిని దళితుడైన నారాయణ్‌కు, పార్లమెంట్ స్పీకర్ పదవిని బాలయోగికి, అసెంబ్లీ స్పీకర్ పదవిని ప్రతిభాభారతికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకి మాధవరావుకు ఇచ్చామని గుర్తుచేశారు.

నడక కష్టమై.. అరగంట విశ్రాంతి
పాదయాత్రలో చంద్రబాబు ఉత్సాహంగా కనిపిస్తున్నా, బొబ్బలెక్కిన కాళ్లతో అడుగు తీసి అడుగు వేయలేపోతున్నారు. రోడ్డుపక్క మట్టిలో నడవడం వంటి 'దారులు' వెతుక్కుంటున్నా పరిస్థితి కష్టంగా ఉంటోంది. ఈ క్రమంలో శనివారం బొబ్బలెక్కిన కాళ్లతో నడవలేక తిమ్మాపూర్ సమీపంలో అరగంటసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి ముందుకు సాగారు