December 2, 2012

ముందు చూపు ఎవరిది?

ముందుచూపు ఎవరిది!? ప్రజా ప్రయోజనాలతో రాజకీయం చేసింది ఎవరు!? టీడీపీ హయాంలో నిజాంసాగర్ నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు ఇవ్వడమే కాకుండా చివరి ఆయ కట్టు భూములకూ సాగునీరు అందించాం. కాల్వల ఆధునికీకరణ చేపట్టాం. నిజాం సాగర్ నీళ్లను పూర్తిగా సాగుకే ఉపయోగించాలని హైదరాబాద్‌కు కృష్ణా నీళ్లు తీసుకొచ్చా. మంజీరా నీటిని కూడా చివరి ఆయకట్టు వరకూ అందేలా చేశా!

రెండేళ్ల కిందట బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేశా. మాజీ ముఖ్యమంత్రి హోదాను కూడా పక్కనపెట్టి మూడు రోజులపాటు పక్క రాష్ట్రంలో జైల్లో ఉన్నాను. కానీ, ఆరోజు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నుంచి సంఘీభావం లభించలేదు. ఇతర రాష్ట్రాలతో మనకు సమస్య వచ్చినప్పుడు వాటి నుంచి నైతిక మద్దతు కూడా లభించలేదు. టీఆర్ఎస్ పట్టించుకోలేదు. సరికదా.. ఎగతాళి కూడా చేసింది. మహారాష్ట్ర మంచినీళ్ల కోసం కట్టుకున్న ప్రాజెక్టును నేను రాజకీయం చేస్తున్నానని విమర్శించింది. కానీ, బాబ్లీ ఫలితాలు ఇప్పుడిప్పుడే ఇక్కడ బయటపడుతున్నాయి. బాబ్లీ పూర్తయితే ఎస్సారెస్పీ పరిధిలోని ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని నేను అప్పుడే గుర్తించి పోరాటం చేశా.

ప్రభుత్వం లిఫ్టులు వేయకపోవడంతో మంజీరా నది పరిధిలోని రైతులు బృందాలుగా ఏర్పడి పొలాలకు సొంతంగా లిఫ్టులు వేసుకున్నారు. విద్యుత్తు లేకపోవడంతో అవి వృథాగా పడి ఉన్నాయి. నిజాంసాగర్ ఆయకట్టు చివరి భూములకూ నీళ్లు రావడం లేదు. ఇటు కరెంటు లేక లిఫ్టులూ పని చేయడం లేదు. రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ఇప్పుడు సర్వత్రా ఒక్కటే సమస్య! కరెంటు.. కరెంటు.. కరెంటు! ఇది కాంగ్రెస్ చేసిన పాపం! నీటి వినియోగంలోనూ విద్యుత్తు సరఫరాలోనూ ముందుచూపు లేని ఫలితం!