December 2, 2012

వైసీపీతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు రాహుల్ యత్నం

ఇంటికొకరు కర్రపట్టి పోరాడాలి!
బ్రిటీష్ వాళ్ల కన్నా కాంగ్రెస్సే ఎక్కువ దోచింది
అదో గజ దొంగల పార్టీ
మాదిగల పొట్టగొట్టింది వైఎస్సే
దాని కోసమే యువరాజు సేన సర్వే
నిజామాబాద్ పాదయాత్రలో చంద్రబాబు
నేటితో 1000 కిలోమీటర్లు పూర్తి
62 రోజుల్లో ఐదు జిల్లాల్లో నడక

నిజామాబాద్, డిసెంబర్ 2 : "కాంగ్రెస్ గజదొంగల పార్టీ. బ్రిటీష్‌వారి కన్నా ఆ పార్టీ వాళ్లే ఎక్కువ దోచారు. ప్రజాధనాన్ని లూటీ చేశారు. వాళ్లంతా దోపిడీ దొంగలు. వైఎస్, ఆయన స్నేహితులు, అనుచరులంతా కలిసి రూ.8 లక్షల కోట్ల నుంచి 9 లక్షల కోట్ల దాకా దోచుకున్నారు. భూగర్భ వనరులనూ వదలలేదు. ఈ దొంగలే ఇప్పుడు దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇలాగే కొనసాగితే దేశమూ రాష్ట్రమూ నాశనమవుతాయి. ఈ కాంగ్రెస్ దొంగల నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కర్రపట్టుకొని పోరాటం చేయాలి'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

నిజామాబాద్ జిల్లా కొడిచర్ల నుంచి ఆదివారం ఆయన పాదయాత్ర ప్రారంభించి 18.9 కిలోమీటర్ల దూరం నడిచారు. కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి షాపులకు వెళ్లి వారితో మాట్లాడారు. పొతంగల్ బస్టాండ్ ఎదుట ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాన్య ప్రజలు కష్టాల సుడిగుండంలో విలవిల్లాడటానికి వైఎస్ పాలనే కారణమని దుయ్యబట్టారు.

"వైఎస్ సీఎం అయ్యాక హైదరాబాద్ చుట్టూ 8 వేల ఎకరాల భూములు, 23 సెజ్‌లను అమ్ముకొని వేలకోట్లు విదేశాల్లో దాచుకున్నాడు. మాదిగల కోసం మేము వర్గీకరణ తీసుకురాగా వైఎస్ దాన్ని తొలగించి వారి పొట్టకొట్టాడు. మైనారిటీలను మభ్యపెట్టి మోసం చేశాడు'' అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేశామని, గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, ఆసుపత్రులు, మౌలిక వసతులు కల్పించామని గుర్తుచేశారు. కానీ కొందరు మాయల మ రాఠీలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. 1994లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తాము అభివృద్థి పథంలోకి తీసుకొస్తే.. తమ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ లక్షల కోట్ల ఆదాయా న్ని దోచుకుందని విమర్శించారు.

"యూరి యా బస్తా కోసం రైతులు లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెంట్ బిల్లు చూస్తే గుండెలు ఆగుతున్నాయి. కరెంట్ ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ దొంగతనం చేయడం వల్లే ప్రజలకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రు. అందుకే టీడీపీ అధికారంలోకి రాగానే రుణమాఫీపైనే తొలిసంతకం చేస్తానని చెప్పాను'' అని వివరించారు. మహానేత ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా టీడీపీ బలహీనవర్గాలను పల్లకి ఎక్కించిందని చెప్పారు. "అధికారంలోకి వస్తే 2500 కోట్లతో మైనారిటీల కోసం ప్రణాళికను అమలు చేస్తాం. 15 సీట్లు ఇ స్తాం. ఇస్లామిక్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలను ఇస్తాం '' అని హామీ ఇచ్చారు.

అవినీతిపైన పోరాటం చేస్తున్నామన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం అవినీతిని ప్రొత్సహించే నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు చేస్తున్న ప్రయత్నాలే దీనికి నిదర్శనమన్నారు. "రాష్ట్రాన్ని దోచుకుని జైల్లో ఉన్న జగన్ పార్టీతో దోస్తి కడితే తమకు ఎంతలాభం వస్తుందని రాహుల్ అనుచరులు రాష్ట్రంలో సర్వే చేస్తున్నారు. వారికి విలువలు లేవు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పోరాడుతున్నారు'' అని దుయ్యబట్టారు. కొత్త మోసాలు, కొత్త ఎత్తులతో ప్రజలను మళ్లీ వంచించేందుకు టీఆర్ఎస్ నేతలు వస్తున్నారని చెప్పారు. యూపీఏ మోసం చేసిందని, ఇక ఎన్డీయేను విశ్వసిద్దామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నట్టు వచ్చిన వార్తలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

" తెలంగాణ కోసం తనను ఢిల్లీ పిలిచారని చెప్పిన కేసీఆర్ అక్కణ్నుంచి వచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని దొంగనాటకం ఆడుతున్నారు. కానీ తామసలు కేసీఆర్‌ను పిలువలేదని వయలార్ రవి ప్రకటించారు. మొన్న బీజేపీని తిట్టిన కేసీఆర్, ఇప్పుడు బీజేపీతో దోస్తీ కడతానని చెపుతున్నాడు. ఇది ద్రోహం కాదా?'' అని బాబు ప్రశ్నించారు. బాబ్లీ వల్ల శ్రీరాంసాగర్ ఎడారిగా మారే పరిస్థితి ఉంటే కేసీఆర్ ఎందుకు పోరాటం చేయలేదని,ఆ పని చేసిన తమను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి వారిని నమ్ముకుంటే అధోగతి పాలు తప్పదని, ఆయన వల్ల ఒరిగేదేమి ఉండదని చెప్పారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని మిగిలిన పార్టీలను మింగేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు అధికారం ఉందని, అందువల్ల తెలంగాణపై వారే నిర్ణయం తీసుకోవాలన్నారు. బిల్లుపెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కావాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

" వైఎస్ ఉన్నప్పుడు నాపై 35సార్లు కోర్టుకు వెళ్లారు. 25 విచారణ కమిటీలు వేశారు. నిజంగా నేను తప్పు చేస్తే వదిలిపెట్టేవారా? నేను నిజాయితీతో ఉన్నాను. విలువలు పాటిస్తున్నాను. అందుకే నా ఆస్తులూ ప్రకటించా''నని గుర్తు చేశారు. మిగిలిన పార్టీల నేతలు ఈ పని చేయగలరా అని ప్రశ్నించారు. పాదయాత్ర తన కోసం కాదని, జనం కోసం అని పునరుద్ఘాటించారు.

"నా లాంటి నాయకుడు ఈ వయసులో ఇలాంటి యాత్ర చేయలేడు. సామాజిక న్యాయం కోసమే ఇదంతా. ఏ పార్టీ మేలు చేస్తుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని కష్టాల సుడిగుండం నుంచి బయటకు తీసుకురావడానికే నేను వచ్చాను'' అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శనివారం రాత్రి చంద్రబాబును చూసేందుకు వచ్చారు. పాదయాత్ర కొడిచర్లకు చేరుకునే సమయానికి అక్కడికి చేరుకున్న ఆమె బాబుతో పాటు రాత్రి బస చేశారు. ఉదయం రెం డు గంటల వరకు భువనేశ్వరి, బాబుతోనే ఉన్నారు. ఇదిలాఉండగా చంద్రబాబు ఉదయం ఫిజియోథెరపీ చేయించుకున్నారు. దీని వల్ల యాత్ర ఆలస్యంగా మధ్యాహ్నం 3.05 గంటలకు ప్రారంభించారు.