December 2, 2012

1000 కిలోమీటర్ల బాబు యాత్ర


పెంటాఖుర్దులో నేటితో పూర్తి

నిజామాబాద్, డిసెంబర్ 2 : నిజామాబాద్ జిల్లాలో సోమవారం చంద్రబాబు పాదయాత్ర 1000 కిలోమీటర్లు దాటనుంది. అనంతపురం జిల్లా హిందుపూర్ నుంచి అక్టోబర్ 2న ఆయన పాదయాత్ర ప్రారంభించి.. ఈ 62 రోజుల్లో ఐదు జిల్లాల్లో యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. బోధన్ మండలం పెంటాఖుర్దులో చంద్రబాబు 1000 కిలోమీటర్ల మైలురాయి దాటనున్నారు. ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు పెంటాఖుర్దు వేదికగా వేడుకలకు సిద్ధమవుతున్నాయి.

ఇదే రోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా ఉండటంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. 1982 డిసెంబర్ 2న జాడి జమాల్‌పూర్‌లో ఎన్టీఆర్ బస చేసిన సందర్భాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు బాబు కూడా డిసెంబర్ 3న అదే గ్రామంలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

జాడి, పెంటాఖర్దుల్లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాలను బాబు ఆవిష్కరిస్తారు. అలాగే వెయ్యి మంది మహిళలతో పాదయాత్ర నిర్వహించనున్నారు. మరోవైపు బాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని రాష్ట్రమంతటా కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలో ఆదివారం 120 మంది రక్తదానం చేయగా, 2 వేల మందికి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.