December 31, 2012

చంద్రబాబు కాదు.. జగనే 420




వైసీపీ అధ్యక్షుడు జగనే 420 అనీ, అందుకే ఆయన జైలులో ఉన్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 420 అనీ విజయమ్మ నిందించడాన్ని ఆయన ఖండించారు. కడపజిల్లా ప్రొద్దుటూరు పెన్నాతీరం వద్ద ఆదివారం టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబును ఒకనాడు ప్రపంచ నాయకులు, రాహుల్‌గాంధీ సైతం పొగిడారనీ, అటువంటి నేతను మోసగాడని విజయమ్మ నిందించడం సరికాదని అన్నారు. జగన్‌పైనే 420 కేసు ఉన్నదనీ, అందుకే ఆయన జైలులో ఉ న్నారన్న సంగతి మరవొద్దన్నారు. హిందూ మతాన్ని అణగదొక్కేందుకు కుట్ర జరుగుతోందనీ, వైసీపీ చర్చిలకు వెళ్లి ఓట్లు వేయాలని కోరడమే ఇందుకు నిదర్శనమన్నారు. వైయస్ఆర్ వల్ల క్విడ్‌ప్రోకో, సీఎం కిరణ్ వల్ల క్రాప్ హాలిడే, పవర్ హాలిడే అనే కొత్త పదాలు ప్రాచుర్యంలోకి వచ్చాయన్నారు.

హైదరాబాద్, బెంగుళూరు, పులివెందులలో లక్షల చదరపు అడుగుల భవంతులు జగన్‌కు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుపాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీఎల్‌పీ ఉప నాయకుడు గా లి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ భార త దేశసంపదను ఇటలీకి తరలిస్తున్నారని ఆరోపించారు. తాను జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటున్న షర్మిల, ఆమె తల్లి విజయమ్మ బాణాలు మనుషులను చంపుతాయన్న సంగతిని తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. ఇకపై టీడీపీలోకి భారీగా వలసలు వస్తాయని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ జోస్యం చెప్పారు. వంద రూపాయల నోట్ల కట్టలను, వెయ్యి వాహనాల్లో తీసుకెళ్లే స్థాయిలో జగన్ సంపాదించారని ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి ఆరోపించారు.

శనగ రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నాయకులు సీఎం రమేశ్, బొజ్జలగోపాల కృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ విస్తృత సమావేశానికి ముందు ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామంలో వర్షాభావం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న బుడశనగ చేలను వారు పరిశీలించారు. కడప జిల్లాలో సుమారు లక్ష హెక్టార్లలో శనగ పంటను సాగు చేశారని, వానలు సరిగా పడకపోవడం వల్ల ఆ పంటంతా దెబ్బతిన్నదనీ తెలిపారు. ఎకరాకు 10 నుంచి 12 బస్తాల వరకు దిగుబడి వచ్చేఈ పంటకు నేడు కొన్ని ప్రాంతాల్లో ఒక్క మూటకూడా రావడంలేదన్నారు. దీంతో రైతులు పరిస్థితి అగ మ్యగోచరంగా తయారైందనీ, వారికి కనీసం బీమాగానీ, నష్ట పరిహారం కానీ ఇచ్చే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. గత సంవత్సరం బీమా కట్టిన రైతులకు చేదు అనుభవం ఎదురైందన్నారు.

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు పంటల బీమాను కూడా వర్తింపజేయాలని రాజ్యసభలోనూ, శాసనసభలోనూ ప్రస్తావిస్తామని వారు చెప్పారు. జిల్లాలో ముగ్గురుమంత్రులు ఉండి కూడా రైతుల కష్టాలను తెలుసుకోవడం లేదనీ, కేంద్రపరిశీలన బృందాలు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించడంలేద నీ వారు ధ్వజమెత్తారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదికలు రాలేదని సమాధానం చెబుతున్నారన్నారు. శనగ పంటకు బీమా గడువును మరో మూడు రోజులు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి సీఎం సురేశ్‌నాయుడు, రైతులు పాల్గొన్నారు.