November 19, 2012

సోనియాతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్న జగన్

హైదరాబాద్, నవంబర్ 19 : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో జగన్‌కు బెయిల్ రావాలంటే సుమారు మూడు, నాలుగేళ్లు పడుతుందని అన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవిశ్వాసం పెడితే తాము యూపిఏ2కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము కూడా వ్యతిరేకంగా ఓటేస్తామని వైయస్సార్ కాంగ్రెసు చెప్పగలదా అని ప్రశ్నించారు. కేసులను మూసేస్తే కాంగ్రెసులో తన పార్టీని కలిపేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. వెలుగులో ముగ్గురు చీకట్లో పదిమంది పార్లమెంటు సభ్యులు తమ వెంట ఉన్నారని చెప్పే పిల్ల కాంగ్రెసు అవిశ్వాసం పెడితే ఎవరి వైపు ఉంటారో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. యూపిఏకి జగన్ మద్దతు ఎందుకు ఉపసంహరించుకోవడం లేదని ప్రశ్నించారు.

డబ్బులు వెదజల్లి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నైతికతనా అని ప్రశ్నించారు. జగన్ పార్టీకి పార్లమెంటరీ వ్యవస్థపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. సమావేశాలు జరగనప్పుడు తీర్మానం ఎలా పెడతారని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు.

టిడిపి అవిశ్వాసం పెడితే ముడుపులు అందుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోందన్నారు. గతంలో అవిశ్వాసం పెట్టినప్పుడు భారీగా ముడుపులు చేతులు మారాయన్నారు. వారి అవిశ్వాసం డిమాండ్ బేరకసారాల కోసమే అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతిచ్చి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చుతామని చెబుతున్నారని, ఏది నమ్మాలన్నారు. ఓ వైపు అవిశ్వాసం అంటూ మరోవైపు బెయిల్ కోసం కేంద్రంపై వారు ఒత్తిడి తీసుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. అవిశ్వాసం పేరుతో బెయిల్ పొందే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
No comments :

No comments :