November 19, 2012

కిరణ్, బొత్స తీరువల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది, కిరణ్ అహంకారి.. బొత్స లిక్కర్ డాన్

కిరణ్ అహంకారి.. బొత్స లిక్కర్ డాన్
వాళ్ల మంత్రే చెప్పాడు
ఆ ఇద్దరితో రాష్ట్రం భ్రష్టుపట్టింది..
పాదయాత్రలో బాబు నిప్పులు
ముస్లింలను దూరం చేసుకున్నామంటూ పశ్చాత్తాపం

 సంగారెడ్డి, నవంబర్ 19 : సీఎం కిరణ్ అహంకారి అని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లిక్కర్ డాన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆ ఇద్దరిపై వాళ్ల పార్టీ మంత్రే మండిపడుతున్నారంటూ కిశోర్‌చంద్రదేవ్ అధిష్ఠానానికి రాసిన లేఖలోని అంశాలను ప్రస్తావించారు. ముస్లింలను దూరం చేసుకోవడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

మెదక్ జిల్లాలో రెండో రోజైన సోమవారం సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్, చేర్యాల, కాశీపూర్, కంది, సంగారెడ్డిలలో 18.2 కిలోమీటర్లు చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. కిరణ్, బొత్స తీరువల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే అవినీతికి ఆజ్యం పోశారని, సోనియాగాంధీకి తెలిసినా పట్టించుకోలేదని విమర్శించారు.

తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు ఇప్పుడు దేనికోసం విడిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో ఇంత డబ్బు ఎలా సంపాదించారో చెప్పాలని న్యాయమూర్తి అడిగితే నీళ్లు నమిలే పరిస్థితి జగన్‌కు వచ్చిందని గుర్తుచేశారు. పిల్ల కాంగ్రెస్ నేత జైలులో ఉండి కూడా రాజకీయాలు చేస్తున్నారని, 10 కోట్లు చొప్పున పశువులకంటే హీనంగా ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ కుంభకోణాల రాజధానిగా మారిందని ఆరోపించారు. కిరణ్ అసమర్థ, చేతకానితనం వల్ల కరెంట్ కొరతలు పెరిగిపోయాయని విమర్శించారు.

చిన్న తరహా పరిశ్రమల యజమానులతోనూ కార్మికులతోనూ మాట్లాడి త్వరలోనే పార్టీపరంగా విధానం ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. "తెలంగాణలో రోడ్లు, మురుగుకాల్వలు, పాఠశాలలకు భవనాలు, ఇతరత్ర నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టింది మేమే. మళ్లీ అధికారంలోకి వస్తే యువకులకు ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం లేక ఉపాధి దొరికే వరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. బలహీనవర్గాల వారికి లక్ష రూపాయలు ఖర్చు చేసి, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటా''మన్నారు.

నేతల పర్యటనల విషయంలో టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. సీఎం కిరణ్, వైసీపీ నేతలు వస్తే అడ్డుకోని టీఆర్ఎస్ తనను మాత్రం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. తెలంగాణపై గడువులతో గారడీలు చేస్తున్న కేసీఆర్ మాటలు నమ్మొద్దని కోరారు. ఆర్నెల్లు పడుకుని, ఆ తర్వాత ఒక్క రోజు వచ్చి గారడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఏనాడూ స్పందించిన పాపాన పోలేదని మండిపడ్డారు.

కాగా, గుజరాత్ అల్లర్ల సమయంలో ఎన్డీయే సర్కారుకు మద్దతు ఉపసంహరించుకొని ఉంటే బాగుండేదని, సకాలంగా నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ముస్లింలను దూరం చేసుకోవాల్సి వచ్చిందని, అందుకు చింతిస్తున్నానని పశ్చాత్తాపం ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింల సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని, ఉద్యోగ, విద్యా రంగాల్లో ఎనిమిది శాతం కోటా కల్పిస్తానని హామీ ఇచ్చారు.
No comments :

No comments :