November 19, 2012

అవినీతిపై పోరాటం చేస్తున్న పార్టీ టీడీపీ

తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు
విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం
అవినీతిపై పోరాటం చేస్తున్న పార్టీ టీడీపీ
ఎన్టీఆర్ సుజల పేరుతో రక్షిత మంచి నీరు

మెదక్, నవంబర్ 19 : ప్రత్యేక తెలంగాణకు తాను వ్యతిరేకమంటూ ఎప్పుడూ మాట్లాడలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణపై తమ వైఖరిని ఇదివరకే స్పష్టం చేశామని తెలిపారు. తెలుగువారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ టీపీడీయేనని ఆయన అన్నారు.

మెదక్ జిల్లా, సంగారెడ్డి మండలం, ఇంద్రకరణ్ నుంచి సోమవారం చంద్రబాబునాయుడు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయమంటూ ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. మరి ఈరోజున కేసులన్నీ ఎత్తివేస్తే పిల్లకాంగ్రెస్, తల్లి కాంగ్రెస్‌లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇక పోతే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆరు నెలలు పడుకుని, తర్వాత లేచి ప్రజల మధ్యకు వచ్చి ఏవోవో మాటలు చెబుతుంది. అవన్నీ మాటలుగానే మిగిలిపోతాయి తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు, అది కూడా కాంగ్రెస్‌లో కలిసిపోడానికి సిద్ధంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇన్ని సంత్సరాలుగా టీఆర్ఎస్ ఉద్యమం చేస్తోంది, ఏమైనా సాధించిందా, ప్రజల కోసం ఏం పోరాటం చేశారు? రైతుల కోసం ఏమైనా ఉద్యమాలు చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

గత ఇరవైఐదేళ్లుగా అవినీతిపై ఒక్క తెలుగుదేశం పార్టీయే పోరాటం చేస్తుందని చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు కుమ్మక్కయి టీడీపీని టార్గెట్ చేశాయని ఆయన ఆరోపించారు. పేదవారందరికి ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని బాబు హామీ ఇచ్చారు. విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

పరిశ్రమలవల్ల కలుషితమైన భూగర్భజలాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎన్టీఆర్ సుజల పేరుతో రక్షిత మంచినీటిని అందిస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. గ్రామస్థుడని జగ్గారెడ్డికి ఓటేస్తే ఎక్కడి సమస్యలు అక్కడే ఆగిపోయాయని అన్నారు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లి యువకుల శక్తి నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాల్లోకి వెళ్ళేందుకు రోడ్డు కూడా సక్రమంగా లేవని చంద్రబాబు విమర్శించారు. జగ్గారెడ్డి సొంత గ్రామం ఇంద్రకరణ్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఆయన విద్యార్ధుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలాల వద్ద రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
No comments :

No comments :