November 19, 2012

మనసులో మాట..చంద్రబాబు నాయుడు

శుభం జరిగిందని మనం నోరు తీపి చేసుకుంటున్నామంటే.. పాయసం వండుకుని ఇష్టంగా తింటున్నామంటే అందుకు కారణం చెరకు రైతు! అంతెందుకు!? ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే టీ తాగాలంటే కావాల్సింది చక్కెరే కదా! నిత్యం లక్షలాదిమంది నోటిని తీపి చేసే చెరకు రైతుకు మాత్రం జీవితమంతా చేదే! కేంద్రం ఎరువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచింది. డీజిల్ ధర పెరిగింది. కూలీలు దొరకడం లేదు! కష్టాల సాగు చేయలేక ఇప్పటికే కొంతమంది సాగు మానుకున్నారు. చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి! వినియోగదారులు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి! అయినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్రను వీడడం లేదు.

మెదక్ జిల్లా ఇంద్రకరణ్, చేర్యాల, కాశీపూర్ గ్రామాల పర్యటనలో చెరకు రైతులు పెద్ద ఎత్తున వచ్చి కలిసి తమ కష్టాలను వివరించినప్పుడు గుండె చెరువైంది. గత ఏడాది టన్నుకు రూ.2100 మద్దతు ధర ప్రకటించారట. అది ఏమూలకూ చాలదు. ఇక, ఈ ఏడాది ఇప్పటి వరకు మద్దతు ధర ఊసే లేదు. చెరకుకు మద్దతు ధర నిర్ణయించే అంశాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా ఫ్యాక్టరీల యాజమాన్యాలకు వదిలేసింది.

టీడీపీ హయాంలో ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ రైతులు అమ్ముకునేవారు. కానీ, ఇప్పుడు ఏ జోన్‌లో ఉన్న రైతులు అక్కడి ఫ్యాక్టరీకే చెరకును అమ్ముకోవాలి. వారు చేసిందే చట్టం. ఇచ్చిందే మద్దతు ధర. ప్రభుత్వ జోక్యం లేదు. దీనికితోడు, ఫ్యాక్టరీల నుంచే నేరుగా రైతుల రుణాలను రికవరీ చేసేసుకుంటున్నారు. చెరకు రైతుకు సలహా సూచనలూ లేవు. పరిశోధనలూ లేవు. దిగుబడి పెంచేందుకు కొత్త ఆవిష్కరణలూ లేవు.

కర్షక పరిషత్తు చైర్మన్‌గా ఉన్నప్పుడు చెరకు రైతుకు యంత్ర పరికరాలపై దృష్టిపెట్టా. అప్పట్లో కొంత చేయగలిగాను. అసలు చేయాల్సిందంతా ఇప్పుడే ఉందనిపిస్తోంది. చెరకుకు వెన్ను పుట్టింది. అది రైతు వెన్నును విరిచేస్తోంది. కష్టాల్లో కూరుకున్న చెరకు రైతును ఆదుకోవాల్సిందే. కానీ ఎలా!?
No comments :

No comments :