October 25, 2012

అవినీతి, అక్రమాలకు పాల్పడినవారే రోడ్డెక్కి మనకంటే పెద్దగా అరుస్తున్నారు--షర్మిళ పాదయాత్రపై బాణాలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరోక్షంగా షర్మిళ పాదయాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్‌లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారే రోడ్డెక్కి మనకంటే పెద్దగా అరుస్తున్నారు తమ్ముళ్లూ అంటూ పరోక్షంగా షర్మిళ పాదయాత్రపై బాణాలు విసిరారు. అవినీతి,అక్రమాలను అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీని దీవించాలంటూ కోరారు.

 మహబూబ్ నగర్ జిల్లా వాసులను చూస్తుంటే చాలా బాధ వేస్తోందనీ, గుక్కెడు నీళ్లు లేక బిందె నీళ్లను రూ. 20 కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో డెంగ్యూ జ్వరం వచ్చి పసిపిల్లలు మంచానపడుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పనులు చేయకపోవడానికి కారణం ఒకటి ఉందనీ, అదే అవినీతి అన్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు అంతా అవినీతిమంతులయిపోయారనీ, సొమ్మును కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఇంకా ఉంటే ప్రజలకు ఏమీ మిగల్చరని అన్నారు.

ఇక అవినీతి నాయకులను ఆదరించకూడదని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు. మీ పిల్లల భవిష్యత్ బంగారుమయం కావాలన్నా, అభివృద్ధి బాటలో పయనించాలన్నా అవినీతిపరులకు ఎంతమాత్రం మద్దతు ఇవ్వకూడదని కోరారు.
No comments :

No comments :