October 2, 2013

మోడీ విజన్ ఉన్న నాయకుడు

ఢిల్లీలోని త్యాగరాజు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్’ సదస్సులో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులు పుట్టిన రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం సూపర్ పవర్ గా అవతరించే రోజు దగ్గర్లోనే ఉందని బాబు అన్నారు. అయితే, ఈ సదస్సులో చంద్రబాబు, బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో వేదిక పంచుకోవడం విశేషం.

గుజరాత్ ను అభివృద్ధి పథంలో ముందుంచి, ఇటీవలే భాజపా ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీపై ప్రసంశల వర్షం కురిపించారు. మోడీ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. గాంధీ, మోడీ ఇద్దరూ గుజరాత్ కు చెందినవారు కావడం కాకతాళీయం అని ఆయన అన్నారు. ఎన్డీఏ హయాంలోనే సంస్కరణలు ఊపందుకున్నాయని… దేశం అభివృద్ధి దిశగా పయనించిందని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు సంస్కరణలను యూపీఏ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

గతంలో అందరూ హైదరాబాద్ గురించి మాట్లాడేవారన్న బాబు… ఇప్పుడు అందరూ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారని మోడీకి కితాబిచ్చారు. తెలుగుదేశం హయాంలో విద్యుత్ ఉత్పాదనలో రాష్ట్రం అగ్రశ్రేణిలో నిలిచేందుకు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టామని వెల్లడించారు. దేశంలోనే అగ్రశ్రేణి విమానాశ్రయం, కన్వెన్షన్ సెంటర్ ను తాము నిర్మించామని చంద్రబాబు తెలిపారు. దీంతో పాటు… ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, న్యాయ విశ్వవిద్యాలయం, బిజినెస్ స్కూలు ఏర్పాటుచేశామని అన్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని బాబు పిలుపునిచ్చారు. నేడు రాజకీయాల పట్ల 71 శాతం యువత ఆకర్షితులవుతున్నారని… ఇది 100 శాతానికి పెరగాలని అభిప్రాయపడ్డారు.