September 17, 2013

విమానాశ్రయానికి తాను ఎన్టీఆర్ పేరు పెడితే దాన్ని మార్చేసి కాంగ్రెస్ రాజీవ్ గాంధీ పేరుపెట్టింది

తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీతోనే ప్రారంభమయ్యాయని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా దినం సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బాబు జాతీయ జెండాను ఎగురువేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను స్వర్గీయ నందమూరి తారక రామారావే తొలగించారన్నారు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపిం తమ పార్టీయేనని చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘనత టిడిపిదే అన్నారు.

 హైదరాబాద్ కు కృష్ణా నది జలాలు తీసుకువచ్చిన ఘనత తమకే చెందుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. భాగ్యనరం చుట్టుపక్కల భూముల అమ్మకాన్ని వ్యతిరేకించామన్నారు. తన కృషి ఫలితంగానే హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటయిందని తెలిపారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు.
హైదరాబాదు చుట్టుపక్కల భూముల అమ్మకాన్ని టిడిపి మొదటి నుండి వ్యతిరేకిస్తోందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భూములు అమ్ముతుంటే తెలంగాణపై ఇప్పుడు మాట్లాడే నేతలు అప్పుడు ఏమయ్యారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
కాంగ్రెస్ కుటిల రాజకీయాలు చూస్తే బాధ కలుగుతోందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను ఎన్టీఆర్ పేరు పెడితే దాన్ని మార్చేసి కాంగ్రెస్ రాజీవ్ గాంధీ పేరుపెట్టిందని అన్నారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తమ పార్టీకి మాత్రమే ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.