September 17, 2013

జగన్‌ కేసు విచారణను అడ్డుకుంటున్నది ఆయనే....!

జగన్‌కు ప్రధాని అండ


కేసు విచారణను అడ్డుకుంటున్నది ఆయనే
కాంగ్రెస్, వైసీపీ మధ్య బెయిల్ డీల్
టీడీపీ ఎంపీల ఆరోపణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 : ఆర్థిక అత్యాచారం చేసి రూ.లక్ష కోట్లు దోచుకున్న వైఎస్ జగన్ బయటకు వచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. జగన్ కేసు విచారణను స్వయంగా ప్రధానే అడ్డుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సమాచారం ఇవ్వకుండా విచారణను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. జగన్ బెయిల్ కోసం కాంగ్రెస్, వైసీపీ మధ్య డీల్ కుదిరిందని, ఈ కారణంగా ఆలస్యమవుతున్న కేసు విచారణను వేగిరపరచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, రమేశ్ రాథోడ్, గుండు సుధారాణి, సీఎం రమేశ్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్, ఈడీ డైరెక్టర్, సీబీఐ డైరెక్టర్‌లను కలిసి ఫిర్యాదుచేశారు. అనంతరం ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మ్యాచ్ ఫిక్సింగ్‌వల్లే జగన్‌పై విచారణ ఆలస్యమవుతోందని నామా ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నాయన్నారు.
జగన్ కేసులో నిందితులైన ఐఏఎస్‌లను విచారించేందుకు అనుమతించాలని సీబీఐ 21 నెలలకిందట కోరినా ఇంత వరకూ కేంద్రం స్పందించలేదని, ప్రధాని ఆధ్వర్యంలో ఉన్న శాఖే సీబీఐకి అనుమతి ఇవ్వటం లేదని, ప్రధాన మంత్రే రక్షిస్తున్నారని ఆరోపించారు. కనీస విచారణ కూడా జరపకుండా తొక్కి పెట్టారనడానికి సాక్ష్యాలున్నాయన్నారు. ఆరు దేశాలనుంచి అక్ర మ సొమ్ము వచ్చిందని సీబీఐ చెప్పినా విచారణే జరగటం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులు రాజీనామా చేసి తమ స్వచ్ఛతను నిరూపించుకోవాల్సి ఉందన్నారు. కానీ, సీబీఐ అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని, ఈ మేరకు సీబీఐ కోర్టులో కూడా చెప్పిందని గుర్తుచేశా రు. రూ.43 వేల కోట్ల మేరకు అవినీతి జరిగిందని సీబీఐ చెప్పిందని, తొలి 3 చార్జిషీట్లలోనే రూ.2000 కోట్లకుపైగా అక్రమ పెట్టుబడులున్నాయని ఈడీ చెప్పిందని.. కానీ, ఇంతవరకూ జరిగిన జప్తు కేవలం రూ.234 కోట్లు మాత్రమేనని తప్పుబట్టారు. ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న జగన్ అవినీతి కళ్లెదుటే ఆధారాల తో కనిపిస్తున్నా ఆ సొమ్మును వెనక్కు తీసుకుని ప్రజలకు తిరిగి ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, హోం మంత్రులను కూడా కలిసి జగన్ కేసు దర్యాప్తుపై ఫిర్యాదు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. వైసీపీ నాయకులు అడిగినప్పుడు ప్రధాని వెంటనే సమయం ఇస్తున్నారని, తాము అడిగితే ముఖం చాటేస్తూ సమయం ఇవ్వటం లేదని ఆరోపించారు. తమ నాయకుడు చంద్రబాబు మూడేళ్లుగా తన ఆస్తులను ప్రకటిస్తున్నారని, వైసీపీ, కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే వారి ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్భయ కేసును ఎనిమిది నెలల్లో విచారించి శిక్షలు వేశారని, ఆర్థిక అత్యాచారం చేసినవారి విషయంలోనూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి అంతే వేగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ బెయిల్ కోసం కాంగ్రెస్, వైసీపీ మధ్య డీల్ కుదిరిందని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసుపట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కొనకళ్ల నారాయణ ఆరోపించారు.
ఆర్థిక నేరాలు చేసిన జగన్‌కు ప్రభుత్వం సహకరించటం సిగ్గు చేటన్నారు. ఓట్లు, సీట్లు, బెయిల్ కోసమే కాంగ్రెస్, వైసీపీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని, ప్రజలు దీనిని గుర్తించాలని కోరారు. ఆర్థిక భూకంపాన్ని సృష్టించిన జగన్ లక్ష కోట్లు దోచుకున్న దొంగ అని, జైల్లో ఉన్న ఖైదీ అని, అలాంటి వ్యక్తిని చూసి తాము భయపడుతున్నామనటం హాస్యాస్పదమని రమేశ్ రాథోడ్ మండిపడ్డారు. అవినీతిపై పోరా టం చేసే తాము ఒక ఖైదీని చూసి భయపడాల్సిన పని లేదన్నారు. జగన్ అవినీతితో పోలిస్తే గాలి జనార్దన రెడ్డి, మధుకోడాల అవినీతి పది శాతం కూడా లేదన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ ఏ పని అయినా చేస్తుందనటానికి జగన్ బెయిల్ డీలే తాజా ఉదాహరణ అన్నారు. తమ పోరాటం అవినీతిపైన అని, ఈ పోరాటంలో భాగంగా ఎవరినైనా కలిసి ఫిర్యాదు చేస్తామని సీఎం రమేశ్ చెప్పారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కూడా తాను బయటకు వస్తే ఫలానా పార్టీకి నష్టమని అనొచ్చని.. అంతమాత్రాన ఆయన్ను వదిలేస్తామా? తాను బయటకు వస్తే టీడీపీకి నష్టం అని జగన్ అన్నంత మాత్రాన ఆయన్ను వదిలేస్తామా? అని ప్రశ్నించారు. దొంగను దొంగ అని నిరూపించేందుకు ఏమైనా చేస్తామన్నారు.

courtesy : andhrajyothi