September 10, 2013

వైసీపీ కూడా తల్లి కాంగ్రెస్ గూటికే దొంగలకు రాజ్యాధికారం ఇవ్వొద్దు...

జస్టిస్ చౌదరిలా మారండి!


 "రాష్ట్రంలో కాంగ్రెస్ దిక్కులేని పరిస్థితిలో ఉంది. ఉప ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, వైసీపీలను అడ్డుపెట్టుకుని గెలవాలనుకోవటం సిగ్గుమాలిన చర్య. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందని నేను ముందే చెప్పాను. అయినా వినకుండా మీరు ఓట్లు వేశారు. చివరికి కాంగ్రెస్‌లో కలిసిపోయింది. తమ్ముళ్లూ..! వైసీపీ కూడా అంతే! పిల్ల కాంగ్రెస్ కూడా తల్లి కాంగ్రెస్ గూటికే వెళ్లిపోతుంది. మీరు కనక వైసీపీకి సీట్లు ఇస్తే వాటిని అమ్ముకుంటుంది. ఇప్పటికైనా కళ్లు తెరవండి! దొంగలకు రాజ్యాధికారం ఇవ్వవద్దు. వాళ్లకు సిగ్గు లేకపోయినా మనకు సిగ్గులేదా? మంచివాళ్లనే గెలిపించండి. ధర్మం, సుపరిపాలన కోసం జస్టిస్ చౌదరిలా మారండి'' అని రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

ప్రజల భవిష్యత్తును నాశనం చేసే వారి గుండెల్లో గునపాలతో గుచ్చాలని, వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని చెప్పారు. కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ఐదో రోజుకు చేరుకుంది. మంగళవారం ఆయన తిరువూరు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్‌లను ప్రజలు ఇంటికి సాగనంపుతారని చెప్పారు. తెలుగు జాతికి సమష్టిగా పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. అవినీతిపరులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

"సోనియా స్క్రిప్టు రాసిస్తే.. టీఆర్ఎస్, వైసీపీ దానిని వల్లె వేస్తున్నాయి. అవినీతి కాంగ్రెస్, వసూళ్ల టీఆర్ఎస్, దొంగల పార్టీ వైసీపీలకు తెలుగు వారి దెబ్బ ఏమిటో రుచి చూపిద్దాం. తెలుగు వాడి దెబ్బ ఏమిటో పంచాయతీ ఎన్నికల్లోనే చూపించారు. కాంగ్రెస్ గెలవలేదని తెలిసి.. ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు వైసీపీలతో లబ్ధి పొందాలని చూస్తోంది. కానీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు శృంగభంగం తప్పదు'' అని చంద్రబాబు చెప్పారు. వైఎస్ హైదరాబాద్‌ను అమ్ముకున్నాడని ఆరోపించారు. వైఎస్ అవినీతి తర్వాత ఇప్పుడు తల్లి, కూతురు, కొడుకు కలిసి దోచుకోవాలని చూస్తున్నారని చెప్పారు. వైఎస్ దోపిడీ విధానాల వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.25 వేల కోట్ల కరెంటు భారం పడిందని దుయ్యబట్టారు.

వైఎస్ లక్ష కోట్లు దోచి కొడుక్కి దోచిపెట్టాడని, అందుకే వైఎస్ చనిపోయిన తర్వాత సీబీఐ జగన్‌ను ప్రధాన ముద్దాయిగా పెట్టిందని చెప్పారు. "సీబీఐ ప్రధాని ఆధీనంలో ఉంది. విజయలక్ష్మి వెళ్లి మన్మోహన్‌ను కలిశారు. వైఎస్ లేకపోవడంతోనే ఈరోజు మాకీ సమస్య అని ఆయన అన్నారు. వైఎస్ అప్పట్లో ప్రధానికి కప్పం కట్టేవారు. ఇప్పుడు ఆ కప్పం నిలిచి పోయిందన్న బాధలో ప్రధాని ఉన్నాడు. నోరు లేకపోయినా, దేశం నాశనమవుతున్నా ప్రధాన మంత్రి కుర్చీని వదలడం లేదు'' అని దుయ్యబట్టారు.


హైదరాబాద్, విజయవాడ: తెలుగు వారి ఆత్మ గౌరవ యాత్ర పేరుతో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రకు ఐదు రోజులపాటు తాత్కాలికంగా విరామం ఇస్తున్నారు. అనారోగ్య కారణాలతో మూడు నాలుగు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయన భావించారు. బుధవారం తిరువూరు నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని, గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. మొదటి విడత యాత్ర వారం రోజులు ఉంటుందని అనుకొన్నా ఈ రెండు జిల్లాల్లో కలిపి 11 రోజులు సాగింది.

ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర వరకూ యాత్ర కొనసాగించాలని ఒక దశలో అనుకొన్నా పార్టీ నేతల సలహాతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా రాయలసీమలో జరపాలని యోచిస్తున్నారు. కాగా.. వస్తున్నా మీ కోసం పేరిట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రలో చర్చకు వచ్చిన అంశాలను రాబోయే ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోకు ప్రాతిపదికగా తీసుకోవాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.