September 10, 2013

చంద్రబాబు యాత్రను అడ్డుకుంటే ఖబడ్దార్ : వర్ల

 చంద్రబాబు యాత్రను అడ్డుకోజూస్తే మీకు శృంగ భంగం తప్పదని వైఎస్ఆర్ సీపీ నాయకులకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వర్ల రామయ్య హెచ్చరించారు. మంగళవారం విజయవాడలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జిల్లాలోని కంభంపాడులో చంద్రబాబు నాయుడు అత్మగౌరవ యాత్రను అడ్డుకోవడానికి వైఎస్ఆర్‌సీపీ వారు ప్రయత్నించారన్నారు.
చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చూసి వైఎస్ఆర్‌సీపీకి నిరాశ, నిస్పృహలు ఏర్పడ్డాయన్నారు. ఆ పార్టీకి తెలంగాణాలో స్థానం లేదని, ఇక సీమాంధ్రలో కూడా రెండు జిల్లాలకే ఆ పార్టీ పరిమితమైందని అన్నారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లోను అధికారంలోకి వస్తామో లేదో అన్న అనుమానం కూడా వారిలో ఉందన్నారు. వారి నాయకుడు జగన్ బయటకు వస్తారో రారో అన్న దిగులు కూడా పట్టుకుందన్నారు. ఇప్పటికే ఐదు ఛార్జి షీట్లు వేసిన సీబీఐ తాజాగా మంగళవారం రెండు ఛార్జి షీట్లు వేసిందని, మరో మూడు ఛార్జి షీట్లు వేయనున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు యాత్రలను అడ్డుకోవాలని విజయలక్ష్మి, జగన్, షర్మిలలు ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇలా దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వాస్తవంగా టీడీపీ కన్నెర్ర చేస్తే 2004లో వైఎస్ పాదయాత్ర, జగన్ ఓదార్పు యాత్ర, ఆ తరువాత షర్మిల యాత్ర, ఇప్పుడు షర్మిల యాత్రలు జరిగేవి కావని అన్నారు. షర్మిల ఇప్పుడు చేస్తున్న యాత్ర కాంగ్రెస్ విలీన యాత్ర అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ యాత్ర చేస్తున్నదన్నారు. చంద్రబాబును, టీడీపీని దెబ్బ తీయడానికి తెలంగాణాలో టీఆర్ఎస్‌తో పొత్తు, సీమాంధ్రంలో వైఎస్ఆర్ సీపీతో విలీనం నాటకమాడి కాంగ్రెస్ ఇప్పుడు విభజన తీసుకువచ్చిందన్నారు.
16 నెలలుగా జగన్ ఎందుకు జైలులో ఉన్నారని ప్రశ్నించారు. 43 వేల కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడినట్లుగా సీబీఐ ఆరోపించి, దానిని నిరూపించి ఛార్జిషీట్ల మీద ఛార్జిషీట్లు వేస్తున్నందుకే అతను జైలులో ఉన్న విషయం జనానికి బాగా తెలుసునన్నారు.