September 10, 2013

సువార్త సభల్లో కురిసేన వర్షాన్ని కూడా ఆపానని చెప్పుకొంటున్న అనిల్ రాష్ట్ర విభజనను ఆపలేరా

వైసీపీపై మండిపడ్డ నర్సిరెడ్డి

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్క నెలలోనే మూడు నిర్ణయాలను ప్రకటించిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నర్సి రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాయడం మాని బ్రదర్ అనిల్ కుమార్‌కు లేఖలు రాస్తే మంచిదన్నారు. సువార్త సభల్లో కురిసేన వర్షాన్ని కూడా ఆపానని చెప్పుకొంటున్న అనిల్ రాష్ట్ర విభజనను ఆపలేరా అని ఆయన ప్రశ్నించారు.

ఒక నెలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడు నిర్ణయాలు ప్రకటించిందని నర్సిరెడ్డి అన్నారు. ఆర్టికల్ బి ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని ఒకసారి, రెండు ప్రాంతాలకు సమన్యాయం అని మరోసారి, సమైక్యాంధ్ర అంటూ ఇంకోసారి ఇలా మూడు రకాలుగా మాట్లాడారన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని శ్రీకృష్ణ కమిటీ గుర్తిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) గుర్తించిందని నర్సిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పైన అనవసర విమర్శలు మానుకోవాలని హితవు ఆయన పలికారు.