September 8, 2013

కాంగ్రెస్సే అగ్గి రాజేసింది.. యుపీఏ పాలన తుగ్లక్ పాలన కాంగ్రెస్, వైసీపీ డీఎన్ఏ ఒక్కటే


రాజకీయ లబ్ధి కోసం తెలుగుజాతి మధ్య అగ్గి రాజేసింది కాంగ్రెస్ పార్టీయేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆత్మ గౌరవ యాత్రలో భాగంగా కృష్టా జిల్లా, నూజివీడులో ఏర్పాటు చేసి సభలో చంద్రబాబు మాట్లాడుతూ యుపీఏ పాలన తుగ్లక్ పాలనలా ఉందని అన్నారు. ఇడుపులపాయ వియమ్మకు, ఇటలీ సోనియాకు లంకె కుదిరిందని, రాష్ట్రంలో చిచ్చు పెట్టారని, కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్, డీఎన్ఏ ఒక్కటేనని ఆయన విమర్శించారు.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం చూసి కాంగ్రెస్ ఓర్వలేక కుట్ర రాజకీయాలు మొదలుపెట్టిందని చంద్రబాబు విమర్శించారు. మన పొట్టగొట్టిన కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అసలు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని కావాలన్న రాహుల్ గాంధీ, సీఎం కావాలన్న జగన్ కలలు కలలుగానే మిగిలిపోతాయని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టవద్దని చంద్రబాబు సూచించారు.

కాగా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆదివారం నాటికి ఎనిమిదవ రోజుకు చేరింది. కృష్ణా జిల్లాలో మూడో రోజు కొనసాగుతోంది.