August 23, 2013

సీమాంధ్రలో ఉద్యమ అణచివేతే లక్ష్యం అందుకే ఎంపీల సస్పెన్షన్, సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు: దేవినేని ఉమా

 రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ సీమాంధ్రలో ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్న ఉద్దేశంతోనే ఎంపీల సస్పెన్షన్, సీమాంధ్ర ఉద్యోగులపై దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెగబడుతున్నాయని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ దుర్మార్గమైనదని, బాధాకరమైన విషయమన్నారు. సీమాంధ్రలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కుతున్నారన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగినులను కించపరిచేలా, దుర్భాషాలాడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో హైదరాబాద్‌లో నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. కోదండరాం దీనికి ఏం సమాధానం చెబుతారని అన్నారు. కడుపులో పెట్టుకుంటామనే కేసీఆర్.. ఈ దాడులపై ఏం సమాధానాలు చెబుతారని ప్రశ్నించారు. సోనియా కళ్లు తెరిచి రాష్ట్ర విభజన ప్రకటన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ బెయిల్ కోసం ఎంపీ రాజమోహనరెడ్డి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్, అక్టోబర్‌లలో జగన్‌ను బయటకు తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ లో కేసీఆర్‌ను, సీమాంధ్రలో వైఎస్ జగన్‌ను కలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.