August 8, 2013

బాబు బేష్..!

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని పలువురు అభినందిస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పలుమార్లు తలాతోకలేని ప్రకటనలు చేయడం.. మళ్లీ వెనక్కు తగ్గడం వంటివి చేస్తుందని ఆ పార్టీకి చెందిన నేతలే అంగీకరిస్తున్నారు. అయితే, చంద్రబాబు అలా కాదని.. విభజన విషయంలో బాబు ఒక స్టాండ్ పై నిల్చున్నారని నేతలు అంటున్నారు. బాబుకు గల స్పష్టతను ఇటు తెలంగాణ నేతలతో పాటుగా, సీమాంధ్ర నేతలు కూడా అభినందిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనాలే ముఖ్యమని బాబు పేర్కొనడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విభజన జరిగితే పార్టీకి నష్టం వాటిలుతోందని.. తెలంగాణపై స్టాండ్ మార్చుకోవాలని కొందమంది సూచించినప్పటికినీ.. బాబు తిరస్కరించారని తెలుస్తోంది.

తెలంగాణపై పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని ఇక వెనక్కు వెళ్లే పరిస్థితి లేదని బాబు స్పష్టం చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తాసుఖేందర్ రెడ్డి అభినందించారు. ప్రత్యేక తెలంగాణపై ప్రకటన చేసిన కాంగ్రెస్ అధిష్టానం మాటనే కాంగ్రెస్ నేతలు వినే పరిస్థితి లేదు.. అంతేకాకుండా కేంద్రం తాను చేసిన ప్రకటనను అమలు చేయడానికే ధైర్యం చేయలేకపోతుంది. ఇలాంటి క్లిష్టమైన సమస్యపై ఓ స్టాండ్ తీసుకోవడమే కాకుండా… ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ స్టాండ్ కట్టుబడి వుంటామని బాబు ప్రకటించడం నిజంగా అభినందించాల్సిన విషయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.