August 8, 2013

చేనేతకు రూ.5 వేల కోట్లు ;చంద్రబాబు

టిడిపి అధికారంలోకి రాగానే చేనేత పరిశ్రమ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమంకోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షులు ఎన్‌.చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చేనేత శ్రామికులకు చేయూతనివ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రపంచ చేనేత దినోత్సవం పురస్కరించుకుని టిడిపి చేనేత విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన సమావేశంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆప్కోను మరింత బలోపేతం చేస్తామన్నారు.

సాంప్రదాయ వృత్తిని నమ్ముకున్న నేతన్నల బతుకులు దయనీయంగా మారాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్వప్రయోజనాలకోసమే వెంపర్లాడుతుందని విమర్శించారు. కేంద్ర మంత్రులు రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా నేతన్నలకు ఒరిగిందేమి లేదన్నారు. కేంద్ర జౌళి శాఖమంత్రిగా కావూరి సాంబశివరావు ఉన్నా చేనేత కార్మికులకు చేసింది శూన్యమన్నారు. టిడిపి అధికారంలోకొస్తేనే కార్మికుల జీవితాలు బాగుపడుతాయన్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల సుడిగుండంలోకి నెట్టడం కాంగ్రెస్‌కు పరిపాటి అయిందన్నారు. వర్షాల వల్ల రిజర్వాయర్లలో నిండా నీరు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేక రైతాంగం ఇక్కట్లు పడుతున్నదన్నారు. ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొస్తే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.