August 26, 2013

ఢిల్లీలో టీడీపీ ఎంపీల దీక్ష భగ్నానికి యత్నం

సీమాంధ్రకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరవధిక నీరాహార దీక్షకు దిగిన టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నిమ్మల కిష్టప్పల దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఢిల్లీలో ఎండ ఎక్కువ ఉండడంతో ఎంపీలు నిరసించిపోయారని, ఇంకా ఎక్కువ సేపు ఉంటే వారు సొమ్మసిల్లిపడిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా నిమ్మల కిష్టప్ప మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు తమ దీక్ష కొనసాగుతుందని, విరమించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు కూడా వదులుకోడానికి సిద్ధమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు సీమాంధ్ర టీడీపీ ఎంపీలు చేపట్ట దలచిన నిరవధిక నిరాహార దీక్షకు స్పీకర్ మీరాకుమార్ అనుమతి నిరాకరించారు. కాగా ఎంపీలు తమ పట్టువీడలేదు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టేందుకు ఎంపీలు సిద్ధమయ్యారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.