July 23, 2013

వైసీపీ,టీఆర్ఎస్‌లకు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే!మిగిలిన విడతల్లోనూ టీడీపీని గెలిపించండి : బాబు

'వైసీపీ, టీఆర్ఎస్‌లకు వేసిన ఓటు కాంగ్రెస్‌కి వేసినట్లే లెక్క. రాష్ట్రాన్ని నా శనం చేసిన కాంగ్రెస్‌కు...దాని బినామీ పార్టీలకు ప్రజలు పంచాయితీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. రెండు, మూడు విడతల్లోనూ టీడీ పీ అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చాలి' అని రాష్ట్ర ప్రజలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత ఫలితాల సరళిని పరిశీలించిన అనంతరం మంగళవారం రాత్రి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తొలి విడతలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రామ సీమలపై చూపించిన పరమ నిర్లక్ష్యానికి నిరసనగానే గ్రామీణ ప్రజలు తిరగబడి అధికార కాంగ్రెస్‌ను రాష్ట్రవ్యాప్తంగా పరాజయంపాలు చేశారని చంద్రబాబు స్పష్టం చేశారు. 'తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పాలనా వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలను, వారి కష్టాలను పట్టించుకొనే నాథుడు లేడు. కరెంటు కోతలు, మంచినీటి కొరతలు, పారిశుద్ధ్య సమస్యలతో గ్రామీణ ప్రజలు అల్లాడుతున్నారు.

మూడేళ్లుగా పంచాయితీలకు ఎన్నికలు లేక అక్కడి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితి. ఈ నిర్లక్ష్యంపైనే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు' అని పేర్కొన్నారు. రూ. లక్ష కోట్ల ప్రజా ధనం దోచుకొని దాచుకొంది చాలక అధికారమే పరమావధిగా నానా విన్యాసాలు చేస్తూ తల్లి కాంగ్రెస్ పార్టీతో రహస్యంగా అంటకాగుతున్న వైసీపీని ప్రజలు తిరస్కరించి తమ విజ్ఞత చూపించారని ఆయన అన్నారు. వసూళ్లనే ఉద్యమంగా మార్చిన టీఆర్ఎస్‌ను కూడా ప్రజలు తిరస్కరించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 'గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టడానికి, గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి టీడీపీకి అవకాశం ఇవ్వండి. టీడీపీకి వేస్తేనే మీ ఓటుకు సార్థకత లభిస్తుంది.

గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు. గ్రామీణ వ్యవస్థను బాగు చేసే శక్తి, చిత్తశుద్ధి ఉన్న పార్టీ మాది. మిగిలిన రెండు దశల్లోనూ మాకు మద్దతివ్వండి' అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాలక పార్టీ అధికార దుర్వినియోగంతోపాటు ఇతర అన్ని పార్టీల ధన బలం, కండ బలాన్ని ఎదుర్కొని మొదటి విడతలో పెద్ద సంఖ్యలో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రెండు విడతల్లో కూడా ఇదే విధంగా ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచే సి ఇంకా ఉత్తేజపూరిత ఫలితాలు సాధించాలని వారిని కోరారు.