July 23, 2013

వైకాపా... వెలవెల!

తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఒకింత మోదాన్ని మరొకింత ఖేదాన్ని మిగిల్చాయి. స్థానిక ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించినా అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి అనే చందాన ఫలితాలు వెల్లడిస్తున్నాయి..ఊహించినట్టుగా పార్టీకి తెలంగాణ జిల్లాల్లో వైఎస్‌ సానుభూతి పనిచేయలేదనే చెప్పాలి. సీమాంధ్రలోనూ మూడు జిల్లాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చినా కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పోటీనిచ్చింది. కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మొదటి స్థానంలో నిలిచింది. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కాంగ్రెస్‌ ఉద్ధండుల కోటలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పాగా వేసింది. సీమాంధ్రలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో ద్వితీయస్థానం సాధించింది. ఇక తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో అనూహ్యంగా 72కు పైగా స్థానాలు కైవసం చేసుకోగా మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉనికీని కోల్పోయింది. కాగా రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వేళ్లపై లెక్కించిదగిన స్థానాల్లోనే విజయం సాధించింది. మొత్తంగా తెలంగాణ జిల్లాల్లో వైఎస్సార్‌ సిపికి సానుభూతి అనుకూలించలేదు. కోస్తాంధ్ర ప్రాంతంలో షర్మిల జరుపుతున్న పాదయాత్ర కానీ, ఆ పార్టీ విజయమ్మ మూడు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులుకానీ ఆ పార్టీకి అనుకున్న విజయాన్ని సాధించిపెట్టలేకపోయాయి. ప్రధానంగా కాంగ్రెస్‌ చీలిక ఓట్లే ఆ పార్టీకి శ్రీరామరక్షగా నిలిచాయి. కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా లేకపోవటం, వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిలను నియమించక పోవటం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అందివచ్చిన అవకాశంగా మారింది. మొత్తంమీద రాత్రి 9.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఆ పార్టీకి శ్రీకాకుళంలో 43, విజయనగరంలో 70, విశాఖపట్నంలో 40, తూర్పుగోదావరి జిల్లాలో 56, పశ్చిమ గోదావరిలో 36, కృష్ణా 27, గుంటూరు 59, ప్రకాశం 51, నెల్లూరు 71, చిత్తూరు 94, కడప 110, కర్నూలు 56, అనంతపురం 90, మెహబూబ్‌నగర్‌ 72, మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్క పంచాయతీని కూడా గెలుచుకోలేదు. కాగా రంగారెడ్డిలో 9, నల్లగొండలో 6, కరీంనగర్‌లో 2, వరంగల్‌లో 8, నిజామాబాద్‌లో ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇవి పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలని, తమ అంచనాల ప్రకారం పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించిందని వైకాపా నేతలు స్పష్టం చేస్తున్నారు.