July 28, 2013

విభజన పై చంద్రబాబు అభిప్రాయం!

తమ బలం అంతా చంద్రబాబుపైనే ఆధారపడి ఉంటుందని, ఆయన ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఆధారపడి తమ విజయావకాశాలు ఉంటాయని తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాల నుంచీ పోటీ చేయడానికి చంద్రబాబుకు అవకాశం ఉండదని, ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవలసి ఉంటుందని, దీనివల్ల ఆయన పోటీ చేయని రెండో ప్రాంతంలో పార్టీ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని తెలుగుదేశం నాయకులు విశ్లేషిస్తున్నారు.

ఈ వాదనలో కొంత హేతుబద్ధత ఉన్నప్పటికీ చంద్రబాబు అభిప్రాయం మరో రకంగా ఉంది. రాష్ట్రం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. విభజనకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉద్యమించడం వల్ల రాష్ట్ర ప్రజలకు మరింత హాని చేసిన వాళ్లం అవుతాం. తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంటే, సీమాంధ్రకు న్యాయం చేయడానికి ఏమి కావాలో అప్పుడే అడగవచ్చునని ఆయన అభిప్రాయపడుతున్నారు. వై.సి.పి. విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికలలో ఆ పార్టీ తెలంగాణలో పూర్తిగా దెబ్బతిన్నందున సీమాంధ్రకు మాత్రమే పరిమితం కావాలన్న నిర్ణయానికి వచ్చారని, ఆ కారణంగానే రాజీనామాల అంకానికి తెర తీశారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో అంతో ఇంతో బలంగా ఉన్నది తెలుగుదేశం పార్టీనే కనుక తొందరపాటుతో వ్యవహరించి నష్టపోకూడదన్నది చంద్రబాబు అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రస్తుత పరిణామాలపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని పార్టీ నాయకులను ఆయన ఆదేశించారు.