June 3, 2013

కేసీఆర్ కాపలా కుక్క కాదు.. పిచ్చి కుక్క...........

మళ్లీ కాంగ్రెస్‌లోకే!: టీడీపీ
ఎన్నికల తర్వాత కేసీఆర్ కలిపేస్తారు..
ఎంపీల చేరిక నాటకం
సోనియాను ఎందుకు తిట్టవు? నీ ములాఖత్ ఏమిటి?
టీఆర్‌ఎస్ అధినేతపై టీ టీడీపీ నేతల ధ్వజం
  ‘‘కాంగ్రెస్ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరడం పెద్ద నాటకం. ఎన్నికల తర్వాత వీరందరినీ కేసీఆర్ కాంగ్రెస్‌లో కలిపేయడం ఖాయం. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులను కేసీఆర్ చప్రాసీలని తిడుతున్నారు. నిజమే. కానీ, ఆ చప్రాసీలను నియమించిన సోనియా గాంధీని ఎందుకు తిట్టవు? సోనియా, రాహుల్‌తో నీ ములాఖత్ ఏమిటి? వాళ్లు వేసే బొక్కలకు ఆశపడి తోకూపుకుంటూ తిరిగే నీతో తెలంగాణ వస్తుందా!?’’ అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకొంటామంటూ ఆజాద్ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్‌ను లోబర్చుకొని ఉద్యమాన్ని చల్లార్చడం.. తర్వాత తెలంగాణ ఊసెత్తకపోవడం ఆ పార్టీకి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. ‘‘మహానాడులో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ తీర్మానం చేస్తుందని టీఆర్‌ఎస్ నేతలు ఊహించలేదు. ఆ తర్వాత మాట్లాడటానికి మరేమీ దొరక్క నోళ్లు మూతపడ్డాయి’’ అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణకు కాపలా కుక్క కాదని, కాంగ్రెస్ పార్టీకి పెంపుడు కుక్క అని ధ్వజమెత్తారు. ‘

‘తొమ్మిదేళ్లపాటు తెలంగాణ వనరులను కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోపిడీ చేస్తున్నా వాళ్లు వేసే బొక్కలకు ఆశపడి నోరు మెదపలేదు. సకల జనుల సమ్మెను అర్ధాంతరంగా ఆపుచేసి వచ్చే తెలంగాణను రాకుండా చేశారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల, పోలవరం, బాబ్లీ, బీడీ  ట్టలపై పుర్రె గుర్తు వంటి వాటిపై దేనిపైనా ఈ కుక్క మొరగలేదు. బొక్కలు నాకుతూ కూర్చుంది’’ అని విరుచుకుపడ్డారు.

హరీశ్.. కేటీఆర్.. వచ్చేయండి: మోత్కుపల్లి
‘‘టీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావు అంటే నాకు అభిమానం. కేటీఆర్ చిన్న పిల్లవాడు. మీరిద్దరూ కేసీఆర్ దుర్బుద్ధులు అలవర్చుకోవద్దు. మీరిద్దరూ టీడీపీలోకి రండి. మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ టీడీపీలోకి వస్తే ఎలా న్యాయం చేశామో అందరూ చూశారని, అభ్యుదయ వాదులు, విద్యార్థులు టీడీపీలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ తనను తాను తెలంగాణకు కాపలా కుక్కగా అభివర్ణించుకుంటున్నారని, నిజానికి ఆయన పిచ్చి కుక్క అని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో కేవలం మూడో వంతు సీట్లలో పోటీ చేసే టీఆర్‌ఎస్‌తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదు. ఎన్ని సీట్లు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీ టీడీపీ ఒక్కటే. అధికారంలోకి వచ్చేది.. తెలంగాణ తెచ్చేది మేమే. కేసీఆర్‌కు నిజంగా తెలంగాణ రావాలని కోరికగా ఉంటే టీడీపీతో కలిసి రావాలి. ఏం కండిషన్లు పెడతావో పెట్టు. నీ పార్టీని టీడీపీలో విలీనం చెయ్యి.

అందరం కలిసి తెలంగాణ సాధించుకొందాం’’ అని అన్నారు. కడియం శ్రీహరి తన కులం వ్యవహారంలో తనపై కేసు వేస్తే సంతోషిస్తానని, తద్వారా, ఆయన కులం ఏమిటో బయటకు వస్తుందని మోత్కుపల్లి అన్నారు. కేసీఆర్‌కు ఫాం హౌస్‌లో నిద్ర పట్టకపోయినా ఆంధ్రావాళ్లదే తప్పా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. ‘‘రాజకీయాల్లోంచి రిటైరైన కేశవరావు, ప్రతి ఎన్నికకూ ఒక పార్టీ మార్చే మంద జగన్నాథం, తాత ముత్తాతల కాలం నాటి వారిని చేర్చుకొని కేసీఆర్ ఎందుకు జబ్బలు చరుచుకొంటున్నారో మాకు అర్థం కావడం లేదు. చేర్చుకొంటే చేర్చుకో. కానీ, ప్రతి దానికీ ఆంధ్రా వాళ్లను తిట్టడం ఎందుకు? నీ అక్రమాలను రఘునందన్ బయట పెడితే ఆంధ్రా వాళ్ల కుట్రేనా!?’’ అని ప్రశ్నించారు.