June 17, 2013

కళంకితులను వదలం: తుమ్మల

సభాధ్యక్షుడి స్థానాన్ని తాము ఎప్పుడూ అగౌరవ పరచబోమని టీడీపీ సీనియర్ సభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. కళంకిత మంత్రులతో నడుస్తున్న కిరణ్ ప్రభుత్వం స్పీకర్ స్థానాన్ని అడ్డుపెట్టుకొని పారిపోవాలని చూస్తే వదిలే ప్రసక్తే లేదన్నారు. కుక్క, తోక అంటూ ఆనం మాట్లాడితే స్పీకర్ అడ్డుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశామే తప్ప సభాధ్యక్షుడి స్థానంపై గౌరవం ఉందన్నారు. దోచుకున్న వాళ్లకు సహకరించిన మంత్రులను కళంకితులనకుండా ఇంకేమంటామని ప్రశ్నించారు.
ప్రభుత్వం నుంచి వారిని బయటకు పంపేదాకా వారు పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకాబోమని చెప్పారు. తెలుగుదేశం పార్టీపై అనవసరమైన నిందలు వేస్తే అది వారికే చుట్టుకుంటుందని కాంగ్రెస్‌ను తుమ్మల హెచ్చరించారు. వెంటనే మంత్రి ఆనం స్పందిస్తూ తనను ఎదుర్కొనేందుకు తుమ్మలను టీడీపీ ప్రవేశపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.
'సభా నాయకుడు సభలో లేరు, ప్రతిపక్షనేత ఎక్కడో ఉన్నారు... దోచుకున్నవాళ్లతో కలిసి మాపై అవిశ్వాసం పెట్టిన టీడీపీవారు మమ్మల్నే తప్పుపడుతున్నారు' అని ఆరోపించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి (సభానాయకుడు) సభలోనే ఉండటంతో 'అటుచూడు ఆనం, సభా నాయకుడెవరో నీకు తెలీలేదు' అంటూ టీడీపీ సభ్యులు సీఎం వైపు చేయి చూపారు