June 19, 2013

గన్‌పార్క్‌ వద్ద దేశం ధర్నా


  విచక్షణా రహితంగా పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు గన్‌పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అడ్డగోలుగా పెంచిన ఇంధన సర్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా వారు సేకరించిన కోటికి పైగా సంతకాలను ప్రదర్శించారు. అనంతరం ఆ పార్టీ శాసనసభా పక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఇప్పటికే 31వేల కోట్ల రూపాయలను ముక్కు పిండి వసూలు చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌ మరో 11వేల కోట్ల భారాన్ని మోపేందుకు పథకాలు సిద్ధం చేసిందన్నారు. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏలుబడిలో సర్వ రంగాల్లో రాష్ట్రం భ్రష్టు పట్టిందన్నారు. అందుకు సాక్ష్యం రాష్ట్రం ఎదుర్కొంటున్న భయంకర విద్యుత్‌ కొరతేనన్నారు. ప్రభుత్వ అసమర్థత, అవినీతిపై తమ పార్టీ నిరంతర పోరు సల్పుతుందన్నారు. ఇంకా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దేవినేని ఉమా మహేశ్వరరావు, ధూళిపాళ నరేంద్ర తదితరులు మాట్లాడారు.

కోటి సంతకాలు స్పీకర్‌కు సమర్పించిన తెదేపా

రాష్ట్రంలో ఏర్పడిన తీవ్రమైన విద్యుత్‌ సమస్యపై వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలతో కూడిన ప్రతులను మంగళవారం శాసనసభలో డిప్యూటి స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్కకు తెదేపా సమర్పించింది. ఈ సంతకాల ప్రతులను గవర్నర్‌కు పంపించాలని విజ్ఞప్తిచేసింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం తర్వాత రావుల చంద్రశేఖరరెడ్డి సంతకాల ప్రతుల అందించే విషయం ప్రస్తావించారు. విద్యుత్‌ కోతపై శ్వేతపత్రం ప్రకటించాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశామని, కానీ, ప్రకటించలేదని, అందుకే బ్లాక్‌ పేపర్‌ సమర్పిస్తున్నామని అన్నారు.

ప్రసంగాలు వద్దని సంతకాల ప్రతులను వెంటనే తనకు ఇవ్వాలని రావులను డిప్యూటి స్పీకర్‌ కోరారు. ఈ సందర్భంగా సంతకాల ప్రతుల కట్టలను, డబ్బాలను తెదేపా సభ్యులు మోసుకుని స్పీకర్‌ పోడియంపై పెట్టారు. అందుకు డిప్యూటి స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సరైన పద్దతి కాదని, స్పీకర్‌ స్థానాన్ని అగౌరపర్చవద్దని హెచ్చరించారు. శాసనసభ సిబ్బంది వచ్చి వాటిని తీసుకుని ఒక మూలనపెట్టారు.