June 19, 2013

ఉత్సవాలపైనా వివక్షేనా? తెలుగు మహాసభలకు రూ.25 కోట్లు.. .. కాకతీయ ఉత్సవాలకు కోటి రూపాయలా?: టీడీపీ


హైదరాబాద్: కాకతీయ ఉత్సవాల నిర్వహణలో రాష్ట్ర సర్కారు తీరని వివక్ష ప్రదర్శించడంపై మంగళవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ఉత్సవాల నిర్వహణ, నిధుల మంజూరులో తీవ్ర వివక్షపై ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లాకు చెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట ప్రభుత్వం రూ.25 కోట్లు ఖర్చు చేసింది. ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేసిందో కూడా తెలియదు. కానీ, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కాకతీయ ఉత్సవాలకు మాత్రం రూ.కోటి మాత్రమే కేటాయించింది. అందుకే ప్రాంతీయ అసమానతలు తలెత్తుతున్నాయి. ఓ వైపు ప్రజలు విడిపోదాం అంటున్నారు. ముఖ్యమంత్రి సైతం వారిని రెచ్చగొట్టే విధంగా ‘ఒక్క పైసా ఇవ్వను, ఏం చేస్కుంటారో చేసుకోండి’ అంటూ మాట్లాడడం దురదృష్టకరం’ అని గాలి పేర్కొన్నారు.

కాకతీయ ఉత్సవాల నిర్వహణ వివరాలపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్ సభ్యుడు సీ ముత్యండ్డి అడిగిన ప్రశ్నపై జరిగిన చర్చ సందర్భంగా ముద్దుకృష్ణమ మాట్లాడారు. కాకతీయ ఉత్సవాల నిర్వహణ కోసం కనీసం రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అభ్యంతరం చెప్పారు. ‘ఉత్సవాల ప్రారంభ కార్యక్షికమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి చిరంజీవి వరంగల్ వస్తే.. తెలంగాణ ఉద్యమకారులు కనీసం మాట్లాడనీయలేదు. ఆయనను మాట్లాడనిస్తే మరిన్ని నిధులు కేటాయించే వారేమో’ అని చెప్పుకొచ్చారు. పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ స్పందిస్తూ.. కాకతీయ ఉత్సవాల కోసం రూ.9.86 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించామని, ముందుగా రూ.కోటి విడుదల చేశామని చెప్పారు.