June 8, 2013

అవినీతికి కాంగ్రెస్‌దే బాధ్యత


కాంగ్రెస్‌పై తెలుగుదేశం పార్టీ మరోసారి నిపలు చెరిగింది. రాష్ట్రంలో అవినీతికి కేంద్ర ప్రభుత్వం, సోనియా బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అవినీతి ద్వారా దోచుకున్న వేల కోట్ల రూపాయలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో అవినీతికి మూలకారుకుడు కేవీపీ అని ఆరోపించారు. అక్రమంగా వేల కోట్లు సంపాదించిన ఆయనను కాంగ్రెస్ చంకనపెట్టుకొని తిరుగుతోందని ఎద్దేవా చేశారు. కేవీపీ బాగోతాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్ అవినీతి మూటలు అందడంతోనే హైకమాండ్ కూడా నోరు విప్పడం లేదన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తుమ్మల, బొజ్జల, పెద్దిరెడ్డి విూడియాతో మాట్లాడూతూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిందని తుమ్మల ఆరోపించారు. జలయజ్ఞనాన్ని ధన యజ్ఞంగా మార్చారని ఐదేళ్ల తాము చెబుతూనే ఉన్నామని... అదే విషయంపై కేబినెట్‌లో మంత్రులు వాగ్వాదానికి దిగుతున్నారని తెలిపారు. ప్రజా సంపదను దోచుకొని కోట్లు కూడబెట్టుకున్నారని, ఆ సొమ్మును అంతా ప్రభుత్వం వెనక్కు తీసుకురావాల న్నారు. వైఎస్ జమానాలో కేవీపీ చక్రం తిప్పారని, ప్రతీ పనికి లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. కేవీపీ చాంబర్ ముందు చప్రాసుల్లా వసూళ్లకు పాల్ప డ్డారన్నారు. వైఎస్ హయాంలో అవినీతికి మూలకా రణమైన కేవీపీ గురించి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైఎస్ నుంచి అవినీతి మూటలు అందుకున్నందుకే అధిష్టానం నోరెత్తడం లేదన్నారు. లక్షకోట్ల సూద్రధారి కేవీపీని కాంగ్రెస్ చంకలో పెట్టుకొని తిరుగుతోందని విమర్శించారు. కేవీపీని వెంటనే అరెస్టు చేసి, అతడి నుంచి అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తాము బలైపోయామంటున్న మంత్రులు ఎవరి వల్ల బలయ్యారో చెప్పాలని సూచించారు. అవినీతి ఎపిసోడ్ లో ఎవరు బాధ్యులో మంత్రులే వెల్లడించాలని డిమాం డ్ చేశారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర కేబినెట్ మొత్తం అర్భకులతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. అన్ని రంగాలనూ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని, చివరకూ ఏపీపీఎస్సీని కూడా వదిలిపెట్టలేదని బొజ్జల మండిపడ్డారు. ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకుంటూ నిరుద్యోగుల ఆశలు వమ్ము చేస్తున్నారన్నారు. పేకాట రాయుళ్లు ఏపీపీఎస్సీ సభ్యులా? అని ధ్వజమెత్తారు. పథకాల ఆర్భాటంలో వైఎస్ కంటే సీఎం కిరణ్ ముదిరి పోయాడని విమర్శించారు.
కేసీఆర్‌కు డబ్బే ముఖ్యం: పెద్ది

ఇదిలా ఉంటే, టీఆర్‌ఎస్‌పై టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ తెలంగాణను వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు తెలంగాణ మూడో ప్రాధాన్యతాంశమని, డబ్బు, కుటుంబం మొదటి రెండు ప్రాధాన్యతలన్నారు. తెలంగాణపై టీడీపీ ఇప్పటికే స్పష్టత ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం చలో అసెంబీే్లక కాదు.. చలో ఢిల్లీకైనా సిద్ధమని ప్రకటించారు.