April 20, 2013

బరిలోకి హరికృష్ణ..!తండ్రి పోటీకి జూనియర్ అంగీకరిస్తారా?

దూకుడుగా వ్యవహరించాలని యోచన
కృష్ణా జిల్లా వైపు చూపు.. గన్నవరంపై ఆరా
హరికృష్ణ వస్తే దాసరి సోదరులు స్వాగతించే అవకాశం
టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

  విజయవాడ క్రియాశీల రాజకీయాలలో ఇకపై దూకుడుగా వ్యవహరించాలని నందమూరి హరికృష్ణ భావిస్తున్నారు. దీనికి తన తండ్రి ఎన్టీఆర్ పురిటిగడ్డ అయిన కృష్ణా జిల్లాను కేంద్రంగా చేసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. జిల్లా నుంచి పోటీ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని హరికృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గన్నవరం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై తన ఆంతరంగికుల ద్వారా హరికృష్ణ ఆరా తీస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ కూడా కొద్దికాలంగా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తరచూ కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. తాజాగా హరికృష్ణ కూడా కృష్ణా జిల్లాపై దృష్టిసారించడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమైంది. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం దాసరి బాలవర్థనరావు ఉన్నారు. ఆయన మూడు దఫాలుగా గన్నవరం స్థానం నుంచి పోటీ చేయగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ సారి గన్నవరం స్థానం నుంచి బాలవర్థనరావు పోటీ చేస్తారా ? వల్లభనేని వంశీకి కేటాయిస్తారా అన్నది చర్చనీయాంశంగా ఉంది. బాలవర్థనరావుకు గన్నవరం సీటు ఇవ్వటానికి మొదట్లో గద్దే రామమోహన్‌కు విజయవాడ ఎంపీ సీటు ఇచ్చారు. ఆయన గెలిచారు. ఆ తర్వాత 2009లో వల్లభనేని వంశీమోహన్ పోటీకి రావటంతో.. ఆయనను కూడా ఆ ఎన్నికలలో విజయవాడ ఎంపీగా పోటీ చేయించారు.

గద్దే రామ్మోహన్‌ను విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయించారు. స్వల్ప తేడాతో వంశీ ఓడిపోయారు. ఆ తర్వాత అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా వంశీని ఎన్నుకున్నారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో, కేశినేని నానిని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా చంద్రబాబు తెర మీదకు తెచ్చారు. అర్బన్ టీడీపీ నూతన అధ్యక్షుడిగా నాగుల్‌మీరాకు అవకాశమిచ్చారు. దీంతో అటు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగాను, ఇటు అర్బన్ టీడీపీ అధ్యక్షుడి పదవులను వంశీ కోల్పోవాల్సి వచ్చింది. గన్నవరం సీటు ఇచ్చే హామీ మీద వంశీని తప్పించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వంశీకి ఈ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు.

తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన గద్దే రామమోహన్ కూడా ఇదే సమయంలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబును కలిసి విజయవాడ ఎంపీ సీటు కావాలని తన మనసులోని కోరికను బయట పెట్టారు. ఎంపీ సీటు విషయమై చంద్రబాబు హామీ అయితే ఇవ్వలేదు కానీ, గన్నవరం, నూజివీడు స్థానాలలో ఏదో ఒకటి ఇస్తానని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, కొత్తగా హరికృష్ణ గన్నవరం నుంచి పోటీ చేయటానికి ఆరా తీయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పాత్రపై పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలున్న ఫ్లెక్సీలను వైసీపీ నేతలు షర్మిల పాదయాత్రలో ప్రదర్శించటం, దానిపై టీడీపీలో వివాదాలు చోటుచేసుకోవడం తెలిసిందే.

తన ఫొటోలను వైసీపీ నేతలు వాడడాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించాలని, లేనిపక్షంలో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో బాలకృష్ణ హెచ్చరించారు. ఆ తరువాత హరికృష్ణ తన సోదరుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.ఈ పరిస్థితులలో హరికృష్ణ గన్నవరం నుంచి పోటీ చేయనున్నట్టు జరుగుతున్న ప్రచారం జిల్లాలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే తనకు అత్యంత సన్నిహితుడైన వంశీ మోహన్ గన్నవరం నుంచి రంగంలో ఉండటంతో, ఆ స్థానం నుంచి తన తండ్రి పోటీ చేయటానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరిస్తారా ? లేదా ? అన్నదానిపై కూడా చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా నందమూరి కుటుంబంలో జరుగుతున్న తాజా పరిణామాలు టీడీపీలో కలవరాన్ని కలిగిస్తున్నాయి.