March 14, 2013

వస్త్ర వ్యాపారులకు టీడీపీ అండ

కవాడిగూడ:: వ్యాట్‌ను రద్దు చేసేవరకూ వస్త్ర వ్యాపారులకు టీడీపీ అండగా ఉంటుందని నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే టీడీపీ మద్దతు ఇస్తుందని అన్నారు. వ్యాట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి ఐదో రోజుకు చేరాయి. చంద్రమోహన్‌రెడ్డి, తలసాని, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలు దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో వస్త్రాలపై వ్యాట్ వి«ధించడం లేదని, మన రాష్ట్రంలో ఎందుకు విధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మీ సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

తలసాని మాట్లాడుతూ, వస్త్ర వ్యాపారులు అసెంబ్లీ ముట్టడికి సిద్ధమైతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగివచ్చి వ్యాట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఏ టీవీలో చూసినా ఎమ్మెల్యేలు కనిపించడం లేదని... చుట్టూ పోలీసులే కనిపిస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమ్మనబోలు ప్రకాశ్, జంటనగరాల కోఆర్డినేటర్స్ మహేంద్ర ప్రసాద్ అగర్వాల్, చీర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సంతోష్ చౌకాని, కమిటీ సభ్యుడు పత్తిపాక సంజయ్ మాట్లాడుతూ, వ్యాట్‌ను ఎత్తివేసే వరకు పోరాటం చేస్తామన్నారు. దీక్షల్లో టైక్స్‌టైల్ వ్యాపారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.