March 5, 2013

గుడివాడ జనం అభిమానం అలాంటిది...

గుడివాడలో నడవడం సొంత ఊళ్లో నడక లాంటిదే. ఇక్కడి జనం అభిమానం అలాంటిది. కొన్ని తరాలుగా పసుపు జెండా నీడన బతుకుతున్న మనుషులు వీళ్లు. ఆ మహానుభావుడి రాజకీయాలకు తొలిపాదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకిక్కడే తొలి పొద్దు. నా దారిని పసుపుమయం చేయడమే కాదు.. గుండె గూట్లోని ఆ దేవుడి జ్ఞాపకాలను పదేపదే గుర్తు చేసుకున్నారు. నన్నూ ఆ జ్ఞాపకాల్లోకి తీసుకుని వెళ్లారు. గుడివాడ పార్టీలో ఇటీవలి పరిణామాలపై కొంత కలత చెందినా.. నాలో ఉత్సాహం నింపేందుకు ఆ బాధని, కసిని గొంతులోనే దాచేసుకున్నట్టనిపించింది. గుండెలపై తన్నిపోయిన వారిపట్ల ధర్మాగ్రహంతోపాటు పార్టీకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేని తల్లిమనసు సైతం వాళ్లలో కనిపించింది.

గుడివాడ పట్టణంలోకి వస్తుండగా శివార్లలో దారిపొడవునా చిన్న చిన్న పరిశ్రమలు కనిపించాయి. కోల్డు స్టోరేజీలు, ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, ఇంజినీరింగ్ వర్క్స్.. ఇలా చాలా పరిశ్రమలు వేలాదిమందికి అన్నం పెడుతున్నాయి. స్వయం ఉపాధికి ఊతమిస్తున్నాయి. కానీ, ఇప్పుడు వాటిని చూస్తే ప్రాణం ఉసూరుమనిపించింది. కరెంటు కోతలతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని నన్ను కలిసిన చిన్న పరిశ్రమల యజమానులు వాపోయారు.

ఒకప్పుడు ఊళ్లో పిల్లలు రోడ్డున పడకుండా అక్కున చేర్చుకున్న చరిత్ర ఇప్పుడు తలకిందులయిందని వారంతా కుమిలిపోయారు. "సార్.. సముద్రతీరాన వ్యాపారం చేస్తున్నాం. వాణిజ్యానికీ కొదవ లేదు. కొరతల్లా కరెంటుకే. వీళ్లు మాకేం ఒరగబెట్టాల్సిన పనిలేదు. రోజులో కొన్ని గంటలైనా కరెంటు ఇస్తే చాలు'' అని ఆవేదన చెందారు. ఆ పరిస్థితి లేకపోవడంతో యూనిట్లు కుంటుబడ్డాయట.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తోచడం లేదట.. పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకోవాల్సి వస్తోందంటూ వాపోయారు. కష్టం చేసేవారిపై ఎందుకో ఇంత కక్ష?