March 5, 2013

జగన్ అంటేనే ప్యాకేజీ బేరాల కోసమే ఆయన వద్దకు.....

జగన్ అంటేనే ప్యాకేజీల పుట్ట అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన వద్దకు బేరాలు కుదుర్చుకోవడానికే వెళుతున్నారని, ఆ పని కాగానే ఫిరాయిస్తున్నారని విమర్శించారు. కృష్ణాజిల్లా గుడివాడ మండలం గాంధీ ఆశ్రమం వద్ద మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రామనపూడి, చిన ఎరికపూడి, గుడివాడ పట్టణం మీదుగా 14.5 కిలోమీటర్లు నడిచారు. గుడివాడ పట్టణంలో జరిగిన బహిరంగ సభకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబం అవినీతిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. "జగన్ ప్యాకేజీలతో రాజకీయ విలువలు పతనమవుతున్నాయి.

పార్టీ మారేందుకు ముందుకొచ్చిన వారికి సూట్‌కేసుల ద్వారా కోట్లు ముట్టచెబుతున్నారు. ఆ డబ్బులకు ఆశపడే ఫిరాయింపుదారులు చంచల్‌గూడ జైలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు'' అని దుమ్మెత్తిపోశారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా వైఎస్ కుటుంబంతో లింకు ఉంటోందన్నారు. బ్రదర్ అనిల్‌ను నమ్ముకున్న వారికి ప్రాణాలు మిగిలే పరిస్థితి కూడా లేదంటూ.. కడపలో వీరభద్రారెడ్డి అనుమానస్పద మృతిని పరోక్షంగా ప్రస్తావించారు.

కాంగ్రెస్ ఘనతగా చెప్పుకొంటున్న రైతు రుణమాఫీలో అవినీతి జరిగిందని 'కాగ్' తేల్చిందని గుర్తుచేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఆరాట పడుతున్నానని, నిద్రలో కూడా ప్రజా సమస్యలే గుర్తుకు వస్తున్నాయని ఆవేదనాపూరిత స్వరం తో చెప్పారు. పాదయాత్ర వల్ల తనకు తెలియకుండానే తనలో మార్పు వచ్చిందని, ప్రజలకు ఏమి చేయాలన్న యాక్షన్ ప్లాన్ మైండ్‌లో రూపుదిద్దుకుంటోందన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తాను బాంబులకే భయపడలేదంటూ 'అలిపిరి' ఘటనను గుర్తుచేశారు.