February 4, 2013

ప్రపంచ పటంలో విజయవాడకు గుర్తింపు తెస్తా

ప్రపంచ పటంలో విజయవాడ నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాను.. గుంటూరు - విజయవాడ మధ్య ఔటర్ రింగ్‌రోడ్‌ను ఏర్పాటు చేసి ఈ రెండింటిని కలిపి మహానగరంగా తీర్చిదిద్దుతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన క్షణమే తాను చెప్పిన ఈ మాటలను ఆచరణలో పెడతానన్నారు. సోమవారం సాయంత్రం విజయవాడ సిద్ధార్థ కళాశాల సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విజయవాడ ఈ పాటికే ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని, అందుకు కావాల్సిన వనరులన్నీ ఇక్కడ పుష్కలంగా ఉన్నా కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్య ధోరణితో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఉద్యోగాల్లేక యువత నిరాశలో మునిగిపోయిందని, టీడీపీ హయాంలో మాత్రమే ఉద్యోగాలు కల్పించామని, ఆ తర్వాత మళ్లీ ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదన్నారు.

యువతకు ఉద్యోగాలు కావాలంటే తెలుగుదేశంనే గెలిపించాలన్నారు. ప్రజలంటే ప్రభుత్వానికి భయం లేకుండాపోయిందని, తమ ఓటు హక్కు ద్వారా ప్రజలు ప్రభుత్వంపై తిరగబడి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం హయాంలోనే మహిళలకు రక్షణ ఉందని చెప్పారు. విజయవాడలో 2010లో జరిగిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు మూడేళ్లయినా అతీగతీ లేకపోవడాన్ని ప్రస్తావించారు. యువత ఫేస్‌బుక్, ఎస్ఎంఎస్‌ల ద్వారా అవినీతిపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఉల్లిధరలు పెరిగి వాటిని నియంత్రించలేక గతంలో రెండు, మూడు ప్రభుత్వాలే కుప్పకూలాయని, ఆ పరిస్థితి పునరావృతం కానున్నదన్నారు. మొగల్రాజపురంలో దొంగల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఈ ప్రభుత్వమే పెద్ద దొంగల పార్టీగా మారిందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

ఉద్యోగులకు అండగా టీడీపీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగులకు అండగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. పీఆర్‌సీ ప్రకారం జీతభత్యాలు చెల్లించే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను తీర్చేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.