February 4, 2013

ఈ దొంగలను తరిమేందుకు కలిసి రండి

రౌడీలదే రాజ్యం!
వైఎస్ కుటుంబానికి ప్రజాభిమానం లేదు
రిగ్గింగ్‌లు, హత్యలతోనే గెలుస్తున్నారు
జంట నగరాలుగా విజయవాడ- గుంటూరు
పాదయాత్రలో చంద్రబాబు హామీ

దొంగ సంతకాలతో పిల్ల కాంగ్రెస్, ఓటుకు నోటుతో తల్లి కాంగ్రెస్‌లు ప్రజలను పచ్చి దగా చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. "దొంగ ఓ వ్యక్తిని దోస్తాడు. గజదొంగ ఓ కుటుంబాన్ని లూటీ చేస్తాడు. కానీ, కాంగ్రెస్, వైసీపీలు రాష్ట్రానే దోచేస్తున్నాయి'' అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటోమొబైల్ రంగం సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్-సికింద్రాబాద్ తరహాలో విజయవాడ-గుంటూరును జంట నగరాలుగా అభివృద్ధిచేస్తానన్నారు.

కృష్ణా జిల్లా విజయవాడ నగరం తూర్పు నియోజకవర్గంలోని శాతవాహన కాలేజీ వద్ద నుంచి సోమవారం పాదయాత్ర కొనసాగించారు. మొగల్రాజపురం, సిద్ధార్థ సెంటర్, సున్నపు బట్టీలు, నిర్మలా కాన్వెంట్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకునేసరికి వేలాదిమంది జనం చంద్రబాబు అడుగులో అడుగు వేశారు. సిద్ధార్థ సెంటర్ నుంచి దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకు రెండు వైపులా పోటెత్తారు. సిద్ధార్థ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబం, కిరణ్ ప్రభుత్వాలను తూర్పారబట్టారు.

"పులివెందులలో మనుషులను చంపి, అనేక హత్యలు చేసి, ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసి, రిగ్గింగ్ చేస్తూ వైఎస్ కుటుంబం గెలిచిందే తప్ప.. ప్రజాభిమానంతోనూ, నైతికంగానూ ఏనాడు విజయం సాధించలేదు. అదే సమయంలో కుప్పంలో ప్రజాభిమానంతో తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది. దొంగ సంతకాలు చేయటంలో ఆశ్యర్యమేముంది తమ్ముళ్ళూ...! టెక్నాలజీని తెలుగుదేశం పార్టీ దేశాభివృద్ధికి ఉపయోగిస్తే.. ఈ కాంగ్రెస్ దొంగలు దోచుకోవటానికి, అవినీతి, అక్రమాలకు ఉపయోగిస్తున్నారు.కాంగ్రెస్ ఓ తప్పుడు పార్టీ. ఇంట్లో కూర్చుని సభ్యత్వాలు చేర్చుకుని, నోట్లతో ఓట్లను కొని సహకార సంఘాల ఎన్నికలను అపహాస్యం చేసింది. రైతులంతా ఓట్లేశారని లిక్కర్ డాన్ బొత్స అంటున్నారు. ముఖ్యమంత్రి చంకలు గుద్దుకుంటున్నారు.

రిగ్గింగ్ చేయటం ద్వారా పోలీసులతో ఇబ్బందుల సృష్టించడం ద్వారానే గెలిచారన్నది వారిద్దరూ తెలుసుకోవాలి'' అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ వెంట ఎలా కలిసి వచ్చారో అంతే స్వచ్ఛందంగా తనతోనూ కలిసి రావాలని ఆకాంక్షించారు. "63 ఏళ్ల వయసులో మీకోసం కష్టపడుతున్నాను. నా కన్నా మీది చిన్న వయసు. మీకోసం కాకుండా సమాజం కోసం కష్టపడండి. మీరంతా రోడ్డు మీదకు రావాలి. నాకు అండగా నిలబడాలి. నిలబడతారా?'' అని ప్రశ్నించగా, "ఆ.. నిలబడతాం'' అని ముక్తకంఠంతో వేలాదిమంది ప్రతిస్పందించారు.

"జేబుదొంగ ఓ వ్యక్తిని, గజదొంగ ఓ ఇంటినే దోచుకుంటాడు. కానీ తల్లి కాంగ్రెస్ - పిల్ల కాంగ్రెస్‌లు ఈ రాష్ట్రాన్నే దోచేస్తున్నారు'' అని మండిపడ్డారు. ఎన్టీఆర్ పాలనలో రౌడీలు రాష్ట్రాన్ని వదిలి పోయారని, ఇప్పుడు వాళ్లే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలో కిలో ఉల్లిపాయలు రూ.40 ధర పలుకుతోందని, తమ పార్టీ అధికారంలో ఉండగా రూ. 4 మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఉద్యోగులకు పీఆర్‌సీని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని దుయ్యబట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను కల్పించాలన్నారు.

యాత్రలో భాగంగా, విజయవాడ ఆటోనగర్‌కు సంబంధించి ఆటోమొబైల్, రవాణా రంగ ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే, ప్రత్యేకంగా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తానని, జిల్లాకి ఓ డ్రైవింగ్ స్కూల్‌ను పెడతానని, రవాణా రంగానికి స్పెషల్ సెజ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని, ఆటోమొబైల్ వారికి జీరో వడ్డీపై స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. విజయవాడ - గుంటూరు నగరాలను జంటనగరాలుగా అభివృద్ధి చేసి, ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్ట్ చేస్తాన న్నారు. ఈ రెండు నగరాలను కలిపి మెగాసిటీ చేసి ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు.