February 4, 2013

పేదలంటే ఎందుకంత అలుసు

 పేదలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత అలుసు.. చాలీచాలని ఇళ్లు ఇచ్చి జబ్బలు చరుచుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం న్యూ రాజరాజేశ్వరీపేటలోని జీ ప్లస్ త్రీ ఇళ్ళ సముదాయం వద్ద జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అవి అసలు కాపురం చేసే ఇళ్ళేనా? వీటిల్లో కాళ్ళు జాపుకుని పడుకునే వీలుందా? సిగ్గు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్ళంటే ఎందుకంత నిర్లక్ష్యం. పేదలతో పెట్టుకోవద్దు. రాబోయే ఎన్నికల్లో వారంతా తడాఖా చూపిస్తారు.. జాగ్రత్త' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉండగా వ్యాంబే పథకం ద్వారా పేదలకు నిర్మించి ఇచ్చిన ఇళ్ళకు వీటికీ ఏమాత్రం పోలిక లేదు. నాణ్యతలో అసలు పోలికే లేదని అన్నారు.

రాజీవ్‌గృహ కల్ప పథకంలో నిర్మించిన ఇళ్ళన్నీ నాణ్యతా ప్రమాణాలు లేక లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నరన్నారు. వాంబే పథకంలో విజయవాడ నగరంలో సుమారు మూడు వేల ఇళ్ళు నిర్మించిఇచ్చామని చంద్రబాబు అన్నారు. పేదలకు భూ పట్టాలు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. రూపాయి తీసుకోకుండా ఇళ్ళ స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఉచితంగా భూ రిజిస్ట్రేషన్ చేసి పేదలకు అందిస్తామన్నారు. ఎక్కడ పని చేసినా పేదలకంటూ ఒక ఆస్తి ఉండాలనే ఉద్దేశంతో వ్యాంబే పథకంలో ఇళ్ళు నిర్మించామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉందని ఎద్దేవచేశారు.

విజయవాడ నగరం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వలసవస్తుంటారు. వారందకీ ఎలాంటి సదుపాయాలు లేవన్నారు. వారు మూడు పూట్ల తింటానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇది దుర్మార్గపు ప్రభుత్వమని ఎన్నికల్లో ఈ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలో ఐటీ, ఇతర పరిశ్రమలు స్ధాపించడానికి అన్ని రకాలైన సదుపాయాలు ఉన్నాయన్నారు. కృస్ణానది నీరు, రైల్వే జంక్షన్, జాతీయ రహదారి వంటి వాటిని ఉపయోగించుకుని నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడకు ఔటర్‌రింగ్ రోడ్డును నిర్మిస్తానని పేదలకు స్ధానికంగానే ఉపాధి అవకాశాలను కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

'బాలికా సంరక్షణ'కు రూ.20 వేలిస్తా టీడీపీ ప్రభుత్వంలో బాలికాసంరక్షణ పథకం ద్వారా అమ్మాయి పుట్టిన వెంటనే బ్యాంకులో రూ.ఐదు వేలు డిపాజిట్ చేసే వారమని, అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రూ.20 వేలు చేస్తామని బాబు ప్రకటించారు. సింగ్‌నగర్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని ఆటో, లారీ తదితర వాహనాల డ్రైవర్లకు బీమా పథకాన్ని వర్తింప జేస్తామని చెప్పారు. ఇక్కడి చేపల మార్కెట్ తదితర విషయాలపై దృష్టి పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావుతో పాటు మరికొంత మంది తనకు చాలా సన్నిహితులని, వారికి ఈ ప్రాంత ప్రజలు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాగవైష్ణవి హత్య జరిగి ఇన్ని ఏళ్ళు గడిచినా కేసు అతీ, గతీ లేదన్నారు. మూడు నెలల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే కేసు విచరణ చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు.