February 24, 2013

చెయ్యెత్తి తిరగబడేది ఎప్పుడో!

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అంటారు. పల్లెలను చూసి దేశం గురించి చెప్పొచ్చునని కూడా చెబుతారు. కానీ, పల్లెలకు ఈ దేశంతో సంబంధం తెగిపోయిందా అనే అనుమా నం కలుగుతోంది. ఒకప్పుడు ఈ సీమలు జ్ఞానానికి, స్ఫూర్తికి నిలయాలు. ఐతే ఇప్పుడవి ఆకలికి ఆలవాలాలు. నిరుద్యోగానికి నిలువెత్తు నిదర్శనాలు. పేదరికానికి ప్రతిధ్వనులు. పేటేరునే కాదు.. ఏ పల్లెను చూసినా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి గుర్తులు తప్ప మరే దాఖలా కనిపించలేదు. సిమెంట్ రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, పాఠశాల భవనాలు తదితరాలన్నీ పల్లెల పట్ల అప్పటి నా ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు సూచికలు! పేటేరు.. పేదల, బడుగుల ఊరు..గీత కార్మికులు, నేతన్నల జనాభా ఎక్కువ.

ఒకరకంగా మాకు సంప్రదాయ ఓటుబ్యాంకు. పాలకులు వాళ్లపై కక్ష కట్టడానికి ఇంతకుమించిన కారణం ఏమి కావాలి? ఇందిరమ్మ ఇళ్ల నుంచి పెన్షన్ల వరకు మొండిచెయ్యి చూపారట. రాజకీయ వివక్ష చూపించారట. గీత కార్మికుల ఉపాధికి ఆధారం లేదట. కులవృత్తులు, చేతివృత్తులు అంతరించిపోయే దశకు వచ్చాయని చెప్పుకొని జనం వాపోయారు. భూములు తనఖాకు పోకుండా భార్యల తాళ్లను రైతులు అడ్డం వేస్తుంటే, మగ్గాలు ఆడించేందుకు నరాలనే నేతన్నలు దారాలు చేస్తున్నారు. వాళ్ల శ్రమశక్తులకు సలామ్!

బేతపూడి..వేములపల్లి శ్రీకృష్ణ పుట్టిన ఊరు. అక్కడకు వెళ్లాకే ఈ విషయం తెలిసింది. ఆయన ప్రసిద్ధ గీతం 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా..' ఎంతో స్ఫూర్తిదాయకం. ఎన్టీఆర్‌కు ఈ గీతం అంటే ఎంతో ఇష్టం. ఆ గ్రామంలో పర్యటించినంత సేపూ ఆ రోజు లు గుర్తుకొచ్చాయి. ఈ మొండిచేతుల పాలనపై చెయ్యెత్తి తిరగబడేది ఎప్పుడో!