February 24, 2013

పేదోడు తెల్లచొక్కా వేస్తే వైఎస్ సహించేవారు కాదు

కాంగ్రెస్‌ను చంపాలి!
కత్తులు, కొడవళ్లతో రైతులు రోడ్డెక్కాలి
బ్యాంకుల్లోని రైతుల బంగారమంతా విడిపిస్తా
గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

  "మీరు ఆత్మహత్య చేసుకోవడం కాదు. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను చంపాలి. రైతులు కత్తులు, కొడవళ్లతో...గీత కార్మికులు మోకులతో రోడ్డెక్కి తిరగబడాలి. అప్పుడే కాంగ్రెస్ కు బుద్ధివస్తుంది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చా రు. కల్లును నిషేధించి గీత కార్మికుల పాలిట వైఎస్ రాజశేఖరరెడ్డి రాక్షసుడిలా వ్యవహరించారని మండిపడ్డారు. "పేదవాళ్లు తెల్లచొక్కా వేసుకొంటే ఆయన సహించేవారు కాదు. పెత్తందారీ, భూస్వామ్య పోకడలతో వ్యవహరించేవారు'' అని గుర్తుచేశారు.

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం పేటేరు నుంచి ఆదివారం ఉదయం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మోర్లవారిపాలెం, బేతపూడి, రేపల్లె టౌన్, అరవపల్లి మీదుగా10 కిలోమీటర్లు నడిచారు. పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగిస్తోందని, విద్యుత్ చార్జీలు మొదలు నిత్యావసర సరుకుల ధరల దాకా..సమస్తం పెంచేసి ప్రజల నడ్డి విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను నరకయాతన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదని, దాన్ని ఎవరూ కాపాడలేరని జోస్యం పలికారు. "ఇప్పుడు ఆ పార్టీకి చావుతెలివి పుట్టుకొచ్చింది. రుణమాఫీ, బీసీలకు 100 సీట్లపై నేను పాదయాత్రలో ఇస్తున్న హామీలను తామూ అమలు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తోంది'' అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే గీత కార్మికులను ఎక్సైజ్ శాఖ నుంచి తొలగిం చి పౌరసరఫరాల పరిధిలోకి తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

"గీత కార్మికులు ఎక్కువగా నివసించే గ్రామాల్లో చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, నీరా నిల్వ చేసుకునేందుకు అవకాశమిస్తాం. కల్లుతోనే శీతల పానీయా లు, మిఠాయిలు, చాక్లెట్లు తయారు చేసే పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాం. వడ్డీలేని రుణాలు ఇస్తాం. భూములు కొనుగోలు చేసి తాటి చెట్ల పెంపకానికి, గొర్రెలను మేపుకోడానికి కేటాయిస్తాం''అని భరోసా ఇచ్చారు. వ్యవసాయం కోసం చాలామంది రైతులు ఇంట్లో ఆడవారి బంగారాన్ని తాకట్టు పెట్టారని, ఆ రుణాలన్నింటినీ మాఫీ చేసి ఆ బంగారమంతా విడిపిస్తామని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఒక అన్నగా, తమ్ముడిగా ఆ బంగారాన్ని ఆడబిడ్డలకు బహుమతిగా ఇప్పిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలకు ముఖ్యమంత్రి కిరణ్ రక్షణ కల్పించలేరని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు రోషం తెచ్చుకొని ఎన్నికల రోజున డబ్బు, మద్యానికి ప్రలోభపడకుండా తనను గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

2,100 కిలోమీటర్లు పూర్తి
చంద్రబాబు పాదయాత్ర ఆదివారం నాటికి 2,100 కిలోమీటర్లు పూర్తి చేసుకుం ది. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం ఇసుకపల్లి నె హ్రూ విగ్రహం వద్ద ఆయన ఈ దూరం అధిగమించారు. ఇప్పటివరకు చంద్రబాబు 13 జిల్లాలు 58 నియోజకవర్గాల పరిధిలోని 115 మండలాల్లో పాదయాత్ర జరిపారు. ఆయనకు పాదయాత్రలో బాసటగా నిలుస్తున్న వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, పేదలు, మహిళలు, యువతకు పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహన్ రావు ఒక ప్రకటనలో కృతఙ్ఞతలు తెలిపారు.

ప్రధాని ఎందుకొచ్చినట్టు?: బాబు
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ హైదరాబాద్‌కు ఎందుకొచ్చిందీ అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. ఇంత దూరం వచ్చి.. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులకు హెచ్చరిక జారీ చేయకపోవడం దారుణమని విమర్శించారు. కేవలం బాధితు ల పరామర్శకే ప్రధాని పర్యటన పరిమితం కావడం ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు.