February 21, 2013

ఆ రెండు పార్టీలు మదమెక్కిన ఏనుగులు

'తల్లి ఏనుగు రోజూ మేసేస్తోంది. మరోపక్క పిల్ల ఏనుగు రూ. లక్ష కోట్లు తిని బాగా బలిసిపోయింది. మదమెక్కిన ఈ రెండు ఏనుగులపై నేను పోరాడుతున్నానని' కాంగ్రెస్‌ను తల్లి ఏనుగుతో, వైసీపీని పిల్ల ఏనుగుతో పోల్చుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీతి, నిజాయితీ, ధర్మం వైపున నిలబడుతూ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానన్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గాడి తప్పిన ర్రాష్టాన్ని నిలబెడతానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.

వేమూరు నియోజకవర్గంలోని జంపని శివారు నుంచి మంగళవారం జిల్లాలో 13వ రోజు పాదయాత్రను చంద్రబాబు కొనసాగించారు. చంపాడ సెంటర్‌లో చంద్రబాబు రాకకోసం గంటల తరబడి వేచి చూసిన ప్రజలు తమ గ్రామానికి రావాలంటూ పట్టుబట్టారు. చంద్రబాబు వారిని సున్నితంగా వారిస్తూ 'తమ్ముళ్ళూ... నేను బస్సు యాత్ర చేయడం లేదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాదయాత్రతో వస్తున్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. చంపాడకు మరోసారి వస్తానని హామీ ఇచ్చి ప్రసంగించారు. చంపాడులో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చి చేసింది ఏమి లేదన్నారు. ప్రజలంతా రోడ్డు మీదకు వచ్చి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

పిల్ల కాంగ్రెస్ వాళ్లు తొలుత మంచివాళ్లను తమ వెంట తీసుకెళ్లి వారు నేరాలు చేసి అందులో ఇరికిస్తారు. ఆ తర్వాత మంచివాళ్లను కూడా నేరాలు చేయాల్సిందిగా ఉసిగొల్పుతారని చెప్పారు. ఆ పార్టీపై దయ తలిస్తే రేపటి రోజున మిమ్మల్ని దయ తలిచే వారుండరని స్పష్టం చేవారు.

చంపాడ సెంటర్‌లో ప్రసంగం ముగించిన అనంతరం స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొన్న చంద్రబాబు అక్కడి నుంచి వేమూరుకు నడక సాగించారు. మార్గమధ్యలో పొలం పనులు చేస్తున్న కూలీలతో సంభాషించారు. ఆర్‌టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులతో 'ఏవమ్మా... బాగున్నారా...' అంటూ పలకరించి వారి కష్టాలను తెలుసుకొన్నారు. చంద్రబాబుకు అడుగడుగునా మహిళలు హారతులతో స్వాగతం పలికారు. వేమూరుకు సమీపంలో మధ్యాహ్న భోజనానికి కాసేపు ఆగిన చంద్రబాబు తిరిగి పాదయాత్రను కొనసాగించారు.

వేమూరు మండల కేంద్రానికి చంద్రబాబు చేరుకోగానే వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు పైకి వచ్చి స్వాగతం పలికి ఆయన వెంట అడుగులు వేశారు. ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద జరిగిన సభలో చంద్రబాబుకు స్వర సమస్య తలెత్తింది. అతికష్టం మీద గొంతును సవరించుకొని తన ప్రసంగాన్ని కొనసాగించారు. మొసలి, కోతి పొడుపు కథతో చైతన్యం నింపిన బాబు సముద్రం వద్ద ఒక మొసలి ఉంటుంది. అది ఏమి తింటుందోనని రోజూ ఒక కోతి పండ్లు తెచ్చి ఇస్తుంది. ఆ మొసలికి ఒక భార్య ఉంటుంది. ఆ భార్య కోతి ఇచ్చిన పండే ఇంత తియ్యగా ఉంటే దాని గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో అని చెప్పి కోతి గుండె కావాలని కోరుతుంది. కోతికి సముద్రంలో విహరించాలన్న కోరిక ఉంటుంది.

దాంతో మగ మొసలి తన మీదకు ఎక్కితే సముద్రం అంతా తిప్పుతానని చెప్పి కోతిని ఎక్కించుకొని మధ్యలోకి తీసుకెళుతుంది. అప్పుడు నీ గుండె కావాలని చెబుతుంది. తెలివిగల వానరం తాను గుండెను చెట్టు మీద పెట్టి వచ్చానని ఒడ్డుకు తీసుకెళితే తెచ్చి ఇస్తానని చెబుతుంది. అది నమ్మిన మొసలి ఒడ్డుకు తీసుకెళ్ళగానే కోతి ఒక్క ఉదుటున దూకి చెట్టు ఎక్కి దుష్టుడా నీపై నేను దయతలిచి తినడానికి పండ్లు ఇస్తే నన్నే భోంచేయాలని చూస్తావా అంటూ దుష్టులతో ఎప్పుడూ సావాసం చేయకూడదని నిర్ణయించుకొంటుంది. పిల్ల కాంగ్రెస్ కూడా మొసలి లాంటిదేనని, దానిపై దయ తలిస్తే అది మిమ్మల్ని మింగేస్తుందని వైసీపీ నుద్దేశించి చంద్రబాబు పొడుపు కథ రూపంలో అందరికి అర్థమయ్యేలా వివరించారు.

వేమూరులో ప్రసంగించిన అనంతరం ఆయన రైల్వేగేటు వద్దకు చేరుకొని అక్కడ రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లో టీ తాగారు. సోడా బండి వద్దకు వెళ్లి గోలి సోడాలు కొట్టారు. పక్కనే ఉన్న సైకిల్ షాపునకు వెళ్లి అప్పుడే తీగెలు అల్లిన సైకిల్ చక్రం గుండ్రంగా ఉందో, లేదో చూశారు. అనంతరం రైల్వేగేటును దాటుకొని ఎన్నికల సంఘం ఆదేశించిన విధంగా వేమూరుకు కిలోమీటర్ దూరంలో పంట పొలాల మధ్యన ఏర్పాటు చేసిన విశ్రాంతి శిబిరంలో ఆగిపోయారు. చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదు, జే ఆర్ పుష్పరాజ్, మాజీ ఎంపీ ఎస్ ఎం లాల్‌జాన్‌బాషా, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జీ వీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, వై వీ ఆంజనేయులు, చీరాల గోవర్ధన్‌రెడ్డి, ఎస్ ఎం జియావుద్దీన్, నిమ్మకాయల రాజనారాయణ, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ముత్తినేని రాజేష్, కొర్రపాటి నాగేశ్వరరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.