February 21, 2013

అవినీతి అందరికీ తెలిసేలా..

రెండు వారాల క్రితం వరకు అవినీతి గురించి ఎవరైనా నోరు విప్పితే 'ఆ... ఎవరు అవినీతికి పాల్పడలేదు. మా డబ్బులేమి దోచుకోలేదు కదా' వంటి మాటలే వినిపించేవి. అలాంటిది నేడు అవినీతిపై పట్టణాల్లోనే కాకుండా పల్లెలు, దళితవాడల్లోనూ కాస్తంత చర్చ ప్రారంభమయ్యేలా చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. గత 15 రోజులుగా అలుపెరగకుండా అవినీతిపై ఆయన అతిసామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చేస్తోన్న ప్రసంగాలు, చెబుతోన్న పొడుపు కథలు ప్రజల్లో కదలిక తీసుకొచ్చే దిశగా కొనసాగుతోన్నాయి.

వైఎస్ రూ. లక్ష కోట్లు జగన్‌కు దోచి పెట్టాడని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సహజంగా లక్ష, కోటి అన్న మాటలు వినడమే తప్పా పల్లెల్లో ఉండే ప్రజలకు వాటిని చూసిన దాఖలాలు ఉండవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు విడమరిచి రూ. లక్ష కోట్లు ఎలా ఉంటాయో చెబుతున్నారు. రూ. 100 నోట్ల కట్ట ఒకటి రూ. 10 వేలు. అలాంటి కట్టలు 500 ఒక గోనెసంచిలో పేర్చితే దాని విలువ రూ. 50 లక్షలు. ఒక్కో లారీకి 200 గోనెసంచుల డబ్బులు పేర్చితే దాని విలువ రూ. వెయ్యి కోట్లు. అలాంటి వెయ్యి లారీల నిండా ఉన్న డబ్బును ఒక్క జగన్ దోచేశాడని చెబుతూ డబ్బు విలువను ప్రజలకు తెలియజేస్తున్నారు.

అవినీతి వలన దాని ప్రభావం అంతా ప్రజల పైనే పడుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఉప్పు మొదలుకొని అన్ని నిత్యవసర సరుకులపై ప్రజలు తెలియకుండానే 13 శాతం పైగా పన్ను చెల్లిస్తున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి ప్రజల సంక్షేమానికి వినియోగించాలి. అయితే పాలకు లు తమ జేబులు నింపుకొంటున్నారంటూ చైతన్యం నింపుతున్నారు. అవినీతి కారణంగా ఇప్పటివరకు స్వాహా అయిన సొమ్ము తిరిగి రాబడితే వంట గ్యాస్ ధర పెంచాల్సిన అవసరం ఉండదు, రుణమాఫీ అమలు చేయవచ్చని చెబుతున్నారు.

అవినీతిపై తాను చెబుతోన్న మాటలను కుటుంబ సభ్యుల మధ్యన చర్చించుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా స్నేహితుల మధ్యన చర్చ జరిపి తాను చెప్పేది వాస్తవమైతే సంఘీభావం తెలపాలని, లేకుంటే మీ ఇష్టమని చెబుతున్నారు. అంతేకాకుండా తన పాదయాత్ర ప్రస్థానంలో అవినీతికి వ్యతిరేకంగా నిలిచి స్ఫూర్తి కలిగించిన వ్యక్తుల అనుభవాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలో ఒక ఆట్రోడైవర్‌ను జగన్‌కు అనుకూలంగా సంతకం పెట్టమని వైసీపీ నాయకులు బెదిరించినా ఆ వ్యక్తి బెదిరిపోకుండా... మీ ఇష్టం వచ్చింది చేసుకోండి... రూ. లక్ష కోట్లు జగన్ దోచాడని అవినీతికి వ్యతిరేకంగా నిలబడిన సంఘటనను ప్రజలకు విశ్లేషిస్తున్నారు.

అవినీతికి, నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలకు సంబంధం ఉందంటూ చంద్రబాబు చేస్తోన్న ప్రసంగాలు క్రమక్రమంగా ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. బియ్యం ధర రూ. 50కి చేరుకోవడం, వంట గ్యాస్‌పై ఆంక్షలు రావడం, విద్యుత్ చార్జీలు రెట్టింపు కావడం వంటివి అవినీతి వలనే పెరిగాయన్న విషయాన్ని గ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలు, నేడు అమలౌతోన్న ధరలు, అప్పటి వేతనాలు, ఇప్పటి వేతనాల మధ్యన ప్రజలు బేరీజు వేసుకోవడం ప్రారంభించారు. అప్పటికి, ఇప్పటికి సంపాదన 10 శాతం పెరిగితే సరుకుల ధరలు 200 నుంచి 300 శాతం పెరిగాయన్న విషయాన్ని చంద్రబాబు ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేస్తున్నారు.