January 20, 2013

అవినీతిపై 'ఫేస్‌బుక్' పోరాటం.. యువతకు పిలుపు

మనకిక చింత చెట్లే గతి!
కోతలతో ఉక్కపోతే
ఇంటికి వెయ్యి రూపాయల బిల్లా?
ఆర్సీసీ నుంచి డీజిల్ చార్జీల దాకా భగ్గు
నల్లగొండ పాదయాత్రలో చంద్రబాబు ఆవేదన
కల్లు పరిశ్రమ పౌర సరఫరాల పరిధిలోకి

  "ఆర్టీసీ టికెట్ల ధరలు పెంచారు. డీజిల్ ధరలు పెరిగాయి. కరెంటు చూ స్తే మండుతోంది. ఏ ఇంటికి చూసినా వెయ్యి రూపాయ లు తక్కువ రావడం లేదు. కోతలతో ఇంట్లో ఉండే పరిస్థి తి లేదు. ఇక మనకు చింత చెట్లే గతి'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. చదువుకున్న తమ్ముళ్లు ఫేస్‌బుక్, ట్విటర్ వాడాలని, సెల్‌ఫోన్‌ల ద్వారా ఎస్సెమ్మెస్ పంపి అవినీతిపై వీరోచిత పోరాటం చేయాలని సూచించారు.

నల్లగొండ జిల్లాలో మూడో రోజు పాదయాత్రలో భాగంగా శనివారం కోదాడ, చిలుకూరు మండలాల మీదుగా 14 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా పాల్గొన్న పలు సభల్లో సామాన్యుడి దయనీయ పరిస్థితిపై పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. "సాగుకు లేదు. తాగేందుకూ లేదు. కరెంట్ ఉండదు. పనులు లేవు. ప్రజాజీవనానికి హాలిడే ప్రకటించాల్సి వస్తోంది'' అంటూ రైతాంగ ఆత్మహత్యలను ప్రస్తావించా రు.

కాంగ్రెస్ మొండిచేయి చూపిందని, టీఆర్ఎస్ కారు పంక్చర్ అయ్యిందని, సైకిల్ ఎక్కితేనే జీవితం భద్రంగా సాగుతోందని అంతా భావిస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వస్తే జిల్లాలవారీగా జనాభాను తీసుకుని ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంటులలో లంబాడాలకు సీట్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గిరిజన పూజారులకు నెలకు ఐదు వేల రూపాయల గౌరవవేతనం వచ్చేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. రైతుల పంపుసెట్లకు సోలార్ ఎనర్జీ ప్లేట్లను సబ్సిడీపై అందజేస్తానని తెలిపారు.

కల్లు పరిశ్రమను ఎక్సైజ్ శాఖనుంచి తప్పించి పౌర సరఫరాల శాఖ పరిధిలోకి తీసుకోస్తానని చెప్పారు. డబ్బులు లేక కాదు..అసమర్థుల మూలంగా రాష్ట్రంలో పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. యూరియా కోసం పోలీస్‌స్టేషన్లకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఐదారు లాఠీ దెబ్బలు తింటేనే ఒక బస్తా దొరికే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. "ఒక బల్బు, టీవీ, ఫ్యాన్ ఉన్న ఇంటికి కరెంట్ బిల్లు వెయ్యి రూపాయలు వస్తోంది.

మనం ఏమైనా వ్యాపారం చేస్తున్నామా.. తమ్ముళ్లూ...'' అని చంద్రబాబు ప్రశ్నించారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో అన్నింటికీ హాలిడేనేనని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెందిన సుశీ హైటెక్ కంపెనీకి అర్హత లేకున్నా.. వేలకోట్ల రూపాయల పనులు అప్పగించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వందల కోట్లలో ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ల నరకాసుర పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆయన పేర్కొన్నారు.

అయ్యా! కరెంటు లేదు.. కొలువులూ లేవు
" అయ్యా! మా ఊరికి రోడ్డులేదు. ఊళ్లో కరెంటు లేదు. ఎండాకాలం తాగు నీరు దొరకదు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. మీరైనా మా కష్టాలు తీర్చండి'' అని చిలుకూరు మండలం సీత్లాతండాకు చెందిన ప్రజలు చంద్రబాబుకు తమ గోడు విన్నవించారు. కరెంట్ లేక నారు ఎండిపోయిందని బదావత్ హచ్చు వాపోయాడు. చంద్రబాబు ఆ నారుని పీకి పరిశీలించారు.

అటుగా వస్తూ గీతకార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక మహిళ భీమ్లి ఊరి కష్టాలను, ఇంటి కష్టాలనూ కలిపేసి గొల్లుమంది ఊరికి రోడ్డు, కొడుకులకు జాబులేదని ఆవేదన వ్యక్తం చేసింది. డీఎస్సీ ద్వారా ఎస్జీటీ పోస్టులు కల్పించాలని కృష్ణమూర్తి అనే నిరుద్యోగి వేడుకున్నారు. బీఎడ్‌లకు ఎస్జీటీలుగా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి అందిస్తామని ఆయనను చంద్రబాబు ఊరడించారు.