January 11, 2013

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను రాబందులా పీక్కుతింటోంది.....

నిరుపేదలపై అన్ని రకాల భారాలు మోపి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను రాబందులా పీక్కుతింటోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 'ఒక్కసారి అధికారం ఇవ్వండి.. అభివృద్ధి ఏమిటో చూపిస్తా'అని భరోసా ఇచ్చారు. జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర రెండో రోజు రెట్టించిన ఉత్సాహంతో సాగింది. గురువారం బచ్చోడు బస నుంచి ఉదయం 11.25లకు ప్రారంభమైన పాదయాత్ర బంధంపల్లి, బీరోలు మీదుగా కూసుమంచి మండలంలోకి ప్రవేశించింది. కూసుమంచి మండలం పెద్దపోచారం, చిన్నపోచారం, కిష్టాపురం, తురకగూడెం క్రాస్‌రోడ్డుమీదుగా రాత్రి 11 గంటల సమయంలో చంద్రబాబు కూసుమంచికి చేరుకున్నారు. అక్కడ బహిరంగ సభ, రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

పోచారం, కిష్టాపురం బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ రైతాంగం ప్రస్తుతం రుణాలు తిరిగి చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, తాము అధికారంలోకి వస్తే.. రైతుల రుణమాఫీ ఫైలుపైనే తొలి సంతకం పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నిరుపేదలపై ప్రభుత్వం ఇప్పటికే రూ.31వేల కోట్ల విద్యుత్ భారాలను మోపిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందడం లేదని విమర్శించారు. బెల్టుషాపుల వల్ల యువత తాగుడుకు బానిసవుతోందని, బెల్టుషాపుల నిషేధంపై రెండో సంతకం పెడతానని ప్రకటించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, ఉద్యోగాలన్నీ ఇతర ర్రాష్టాలకు తరలి వెళ్తున్నాయని విమర్శించారు. దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి రూ.లక్షా నలభై వేల కోట్లను జగన్‌కు దోచిపెట్టాడని ఆరోపించారు. గత పాలకుల దోపిడీ మూలంగా ప్రజలపై భారం పడుతోందని చెప్పారు.

బీసీలకు వంద సీట్లు

టీడీపీ అధికారంలోకి రాగానే చేతివృత్తుల వారిని, బడుగు, బలహీనవర్గాల వారిని ఆదుకుంటామన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. పాలేరు జలాలను అన్ని గ్రామాలకు సరఫరా చేసి మంచినీటిని అందిస్తామని తెలిపారు. హైస్కూల్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేసి తిరిగి చెల్లిస్తామని చెప్పారు. బచ్చోడు-బంధంపల్లి గ్రామాల మధ్య రైతులు, వ్యవసాయ కూలీలు, పైలేరియా బాధితులు, వృద్ధులు చంద్రబాబును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పైలేరియా బాధితులను వికలాంగులుగా గుర్తించి న్యాయం చేయాలని కోరగా అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ పెంచడంతోపటు అన్ని వి«ధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు సాగు చేసిన మిర్చి పంటను పరిశీలించి, సాగువెతలపై రైతులతో ముచ్చటించారు.

సమస్యలు ఏకరువు..

కరెంట్ కోతవల్ల పంటలు కోల్పోతున్నామని, వరి అసలు సాగు చేయలేకపోయామని రైతులు చంద్రబాబుకు గోడు వెళ్లబోసుకున్నారు. వంద రూపాయల కూలీ ఎటూ సరిపోవడం లేదని రైతు కూలీలు వాపోయారు. వృద్ధులు తమకు పింఛన్లు అందడంలేదని వాపోయారు. తాము అధికారంలోకి వచ్చాక.. పింఛన్లు అందరికీ సక్రమంగా అందేలా చూస్తామని, పింఛను మొత్తాన్ని రూ.1500 కు పెంచుతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి, నిరాదరణకు గురైన వృద్ధులను ఆదుకుంటామన్నారు. అటు కిరణ్ ప్రభుత్వాన్ని, జగన్ అవినీతిని ఎండగడుతూ.. ఇటు విద్యుత్, నిరుద్యోగ , రైతాంగసమస్యలను ప్రస్తావిస్తూ వాటికి పరిష్కారం చెప్తూ చంద్రబాబు యాత్ర సాగింది. చంద్రబాబు యాత్ర సాగిన ప్రతి గ్రామంలోనూ ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు రాక కోసం మహిళలు, యువకుల, చిన్నారులు కూడా పనులు మానుకుని ఎదురుచూడడం విశేషం. రెండోరోజు 18కి.మీ.పాదయాత్రసాగింది.

భూషమ్మకు రెండువేల సహాయం:

చంద్రబాబు పాదయాత్రలో బీరోలు గ్రామం వద్ద భూషమ్మ అనే 70 యేళ్ల వృద్దురాలు చంద్రబాబుకు తనకు మూడేళ్లుగా పింఛన్ రావడం లేదని చెప్పుకుంది. వెంటనే బాబు స్పందించి రూ.2వేల నగదును ఆమెకు అందించారు.

నేడు బాబు యాత్ర ఇలా..

గురువారం రాత్రి కూసుమంచిలో బసచేసిన చంద్రబాబు శుక్రవారం లోక్యాతండా, కోక్యాతండా, నేలపట్ల, అగ్రహారం, జీళ్లచెరువులో మద్యాహ్నం భోజనం, గోపాలరావుపేట ఖమ్మంరూరల్ మండలంలోని తల్లంపాడు, పొన్నెకల్‌క్రాస్‌రోడ్డు, మద్దులపల్లి, తెల్దారుపల్లిక్రాస్‌రోడ్డు, కోదాడ క్రాస్‌రోడ్డుకు చేరుకుంటారు. మొత్తం 18కి.మీ పాదయాత్ర జరగనుంది. రాత్రికి ఆయన కోదాడ క్రాస్‌రోడ్డులో బస చేస్తారు.

మాలాంటి వాళ్లకు న్యాయం జరగాలంటే మీరు మళ్లీ సీఎం అవ్వాలి సార్...

(బాబుతో ఓ దళిత యువతి)

తిరుమలాయ పాలెం మండలం బచ్చోడు గ్రామ శివార్లలో పాదయాత్రకు ఎదురొచ్చిన మహిళా కూలీల్లో ఓ యువతి వెళ్లబోసుకున్న దళిత కుటుంబాల బాధలను విన్న చంద్రబాబు చలించారు.

చంద్రబాబు: ఏమ్మా నీ పేరు ఏంటి.. నీసమస్య ఏంటి?

సరిత: సార్ నాపేరు సరిత..(చెమర్చిన కళ్లతో..)

చంద్రబాబు: నీబాధ ఏంటో చెప్పమ్మా..

సరిత: ఎస్సీ రిజర్వేషన్లు జరగక పోవటం వల్ల ద ళితులకు అన్యాయం జరగుతోంది సార్. మా కు లంలో చదువుకున్నా కూలీగానే బతకాల్సివస్తోంది. చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరకక పొలం ప నులకెళుతున్నాం. మా ముత్తాత, తాతలతో పాటూ మా బతుకులు కూడా రెక్కాడితేనే కానీ డొక్కాడని దుస్థితిలో ఉన్నాయి. మీరు సీఎంగా ఉన్నప్పుడు రి జర్వేషన్లు అమలయ్కాయి. తర్వాత లేవు. మా లాంటి నిరుపేదలకు న్యాయం జరగాలంటే మళ్లీ మీరు సీఎం కావాలి సార్. మీకు మేం అండగా ఉం టాం.. మిమ్మల్ని గెలిపించుకుంటాం.

చంద్రబాబు: మేం అధికారంలో ఉండగా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేశాం. కేవలం నాలుగేళ్లలో దళితులకు తొమ్మిదివేల ఉద్యోగాలిప్పించాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దానిని విస్మరించటంతో దళితుల కష్టాలకు కారణమయ్యింది. అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ జరిపి తీరతాం.