January 11, 2013

మహాస్తూపం.. మరిచిపోలేని జ్ఞాపకం: చంద్రబాబు

విజయ స్తూప ఆవిష్కరణ తన రాజకీయ జీవితంలో మరపురాని జ్ఙాపకంగా నిలిచిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మాదిరి పురం బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. పాదయాత్ర వందోరోజును పురస్కరించుకొని స్థానిక నేతలు స్తూపం ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. వంద గంటల్లో వంద అడుగుల నిర్మాణం పూర్తి చేయటం నిజంగా అభినందనీయమన్నారు. ఇందుకు శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్ర వందోరోజు ఖమ్మం జిల్లాలో అడుగిడడం, అదీ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జనవరి 9నే కావడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. గతంతో పోలిస్తే తనకు పాదయాత్ర సందర్బంగా జిల్లాతో మరింత అనుబంధం పెరిగిందన్నారు. ఈ దఫా సంక్రాంతి పండుగ కూడా ఖమ్మంలోనే జరుపుకోబోతున్నట్లు చెప్పారు. ఇన్ని రోజులే నడవాలి అన్న నియమం తనకేమీ లేదని, జనం సమస్యలు పరిష్కారమయ్యే వరకు నడక సాగుతుందన్నారు. ఎన్ని అవాంతరాలొచ్చినా నడక ఆపేది లేదన్నారు. ప్రజల అభిమానం ఆదరణ తనకు కొత్త శక్తినిస్తున్నాయన్నారు.