December 8, 2012

వైసీపీ కాదు.. కాంగ్రెస్ వై:పాదయాత్రలో చంద్రబాబు

జగన్ డబ్బుకు అమ్ముడుపోతున్నారు
అలాంటి నేతలను చిత్తు చేయండి
అదంతా రాష్ట్రాన్ని దోచి కూడబెట్టిందే
అందులే పదిశాతం పంచినా గ్రామాలకు మహర్దశ
పార్టీని వదిలేసిన వాళ్ల బెదిరింపులకు వెరవం
కార్యకర్తల కోసం ప్రాణాలు ఇస్తా
ఆదిలాబాద్ పాదయాత్రలో చంద్రబాబు

ఆదిలాబాద్, డిసెంబర్ 8 :పంట చేన్లలో అడవి పందులు పడి తిన్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు పడి తింటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఐ తల్లి పార్టీ అయితే కాంగ్రెస్ వై ( వైసీపీ) పిల్ల కాంగ్రెస్ అని, ఆ రెండు ఒకటవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు. జగన్ దోచిన లక్ష కోట్ల డబ్బులో పది శాతం ఖర్చు చేసినా ఎన్నో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూడో రోజైన శనివారం భైంసా పట్టణం నుంచి చంద్రబాబు పాదయాత్ర మొదలైంది. పిప్రికాలనీ, మాటేగాం, వానలపాడు, తిమ్మాపూర్ క్రాస్‌రోడ్, కల్లూరు, బూర్గుపల్లి, అర్లిక్రాస్‌రోడ్, చాక్‌పల్లి, కుంటాల క్రాస్‌రోడ్, అర్లీ క్రాస్ వరకు 16 కిలోమీటర్ల దూరం నడిచారు.

కార్ఖానాల్లో కార్మికులను పలకరిస్తూ, బీడు భూముల్లో రైతుల బాధలు వింటూ ముందుకు సాగారు. భైంసాలోని బీడీ కార్ఖానాల్లోకి వెళ్లి బీడీ కార్మికులను పలకరించారు. వారి చెప్పిన సాధక బాధకాలు విని ధైర్యం చెప్పారు. అనంతరం భైంసా, మాటేగాం, వానల్‌పాడ్, కల్లూరు, బూరుగుపల్లి సభల్లో ప్రసంగించారు. వైఎస్ జగన్ లక్ష కోట్ల రూపాయలను దోచుకున్నారనీ, ఆ డబ్బులతోనే ఎమ్మెల్యేలను, ఎంపీలను కొంటున్నారని మండిపడ్డారు. అలాంటి ప్రలోభాలకు లొంగిపోయిన వారిని చిత్తుగా ఓడించాలని కోరారు. పార్టీని వీడిన వారు..పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారనీ, వారి బెదిరింపులకు భయపడవద్దని పిలుపునిచ్చారు.

అవసరమైతే కార్యకర్తల కోసం ప్రాణాలు అర్పిస్తానన్నారు. తాను ఏ కులానికి వ్యతిరేకం కాదని, సామాజిక న్యాయం కోసమే పార్టీ పాటుపడుతున్నదంటూ..భైంసాలో శుక్రవారం మాలల నిరసన యత్నాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అవినీతికి కేంద్రంగా మారిందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే గోదావరి జలాలను తరలించి గిరిజనులకు తాగునీటిని సరఫరా చేస్తానని భరోసా ఇచ్చారు. వెయ్యి బీడీలకు 150 రూపాయలు ఇచ్చేలా, మరిన్ని ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్రాన్ని గుజరాత్ చేయండి సార్
యువకుడి విన్నపం
ఆదిలాబాద్ జిల్లా మాటేగాం గ్రామంలో చంద్రబాబుకు ఓ అరుదైన అనుభవం ఎదురైంది. అవినీతి రూపుమాపే చర్యలపై మాట్లాడాలని చంద్రబాబు కోరగా.. ఓ యువకుడు ముందుకొచ్చాడు. తన పేరు చంద్రశేఖర్ అని పరిచయం చేసుకున్నాడు. "మీరు మళ్లీ సీఎం కావాలి సార్.. ఆ తరువాత మన రాష్ట్రాన్ని గుజరాత్‌గా మార్చే బాధ్యత మీదే'' అని అభ్యర్థించారు.

అప్పటి టీడీపీ పాలనను, ఇప్పటి కిరణ్ పాలనతో పోల్చుతూ చంద్రశేఖర్ వెలిబుచ్చిన అభిప్రాయాలను చంద్రబాబు చిరునవ్వుతో ఆలకించారు. "ఈ ఎనిమిదేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండిఉంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్ రాష్ట్రంలా వెలిగిపోయేది'' అని చెప్పారు. చంద్రబాబు సీఎం అయితే, మోడీ గుజరాత్‌ను అభివృద్ధి చేసినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

సీరియస్‌గా తీసుకుంటా: బాబు
ఆదిలాబాద్: "వచ్చారు.. కలిశారు.. ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకుంటాను. కఠినంగా ఉంటాను''.. ఎఫ్‌డీఐల ఓటింగ్ సమయంలో కొందరు పార్టీ ఎంపీల గైర్హాజరీపై చంద్రబాబు వ్యాఖ్య ఇది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించే విషయమై రాజ్యసభలో శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో టీడీపీకి చెందిన ఐదుగురు ఎంపీల్లో ముగ్గురు పాల్గొనలేదు. ఈ అంశం శనివారం వానల్‌పాడు గ్రామానికి పాదయాత్ర చేరుకున్నప్పుడు ప్రస్తావనకు వచ్చింది.

గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్న చంద్రబాబు, కాంగ్రెస్.. వైసీపీ నేతల అవినీతిపై చెలరేగి విమర్శలు చేస్తున్న సమయంలో సభలోని ఓ యువకుడు ముందుకొచ్చాడు. "ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో పాల్గొనని రాజ్యసభ సభ్యులపై చర్యలు తీసుకోవాలని'' గట్టిగా అరిచాడు. ఆవేశంతో ఊగిపోతున్న అతడికి సర్దిచెప్పేందుకు అక్కడి కార్యకర్తలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చంద్రబాబే స్పందించాల్సి వచ్చింది.