December 3, 2012

జగన్ పార్టీ పని ఖతం!

కాంగ్రెస్ కలవకపోతే అంతే సంగతులు
అసెంబ్లీలో వైసీపీని ఇరుకునపెట్టాం
'మ్యాచ్ ఫిక్సింగ్' కుట్రను ఎండగట్టాం
'అవిశ్వాసం' సవాల్‌ను తుత్తునీయం చేశాం
టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అభినందన
పాదయాత్ర ఆలోచన లోకేశ్‌దేనని వెల్లడి
ప్రసంగంలో పలుసార్లు తనయుడి ప్రస్తావన

నిజామాబాద్, హైదరాబాద్, డిసెంబర్ 3 : రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పుట్టగతులు లేవని, వైసీపీ నేత జగన్ పని అయిపోయిందని, ఆ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీఎల్పీ అభిప్రాయపడింది. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ అధినేత చంద్రబాబు.. భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉత్సాహపరిచారు. ప్రతి నియోజకవర్గంలో చేపట్టి కాంగ్రెస్, వైసీపీ అవినీతిని వివరించాలని మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆ రెండు పార్టీలు మాదిగలను మోసగించిన వైనాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ వద్ద సోమవారం ఆయన టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. పలు అంశాల్లో తన తనయుడు లోకేశ్ చొరవను చంద్రబాబు ప్రశంసించడం అక్కడున్న నేతల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావల్సిన సమావేశానికి లోకేశ్ హాజరు కావడం చర్చనీయాంశమైంది. బాబుతోపాటు సోమవారం పాదయాత్రలో ఉన్న లోకేశ్, టీడీఎల్పీ భేటీకి కూడా హాజరయ్యారు.

"పాదయాత్ర కు స్ఫూర్తి లోకేశ్. కుప్పం నియోజకవర్గంలోని రెండు మండలాల్లో లోకేశ్ పాదయాత్ర నిర్వహించి, ఆ ఫలితాలను నాకు తెలియజేశారు. దాని ఆధారంగానే ' వస్తున్నా మీ కోసం' రూపుదిద్దుకుంది'' అని వివరించారు. తన యాత్రను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో "పల్లెపల్లెకు తెలుగుదేశం'' పేరిట పాదయాత్రలు నిర్వహించాలని నాయక శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నా అమలు చేయలేదని, ఇకనైనా దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను చంద్రబాబు విశ్లేషించారు.

"మూడేళ్లుగా టీఆర్ఎస్, వైసీపీ ప్రజలను మాయ చేస్తున్నాయి. అవినీతి అందరూ చేస్తారంటూ వైసీపీ.. ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తోంది. సెంటిమెంటును అడ్డం పెట్టుకున్న టీఆర్ఎస్.. తానేమి చేసినా తిరుగులేదన్నట్టు వ్యవహరిస్తోంది. ఇతర పార్టీలు తెలంగాణలో తిరగొద్దంటూ హుకుంలు జారీ చేసింది. మ రోవైపు, కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాల్లో విఫలమైంది'' అని వివరించారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలివితో వ్యవహరించి ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగాలని కోరారు. గతంలో టీడీపీ పరిపాలన ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ విషయంలో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల చొరవను చంద్రబాబు అభినందించారు.

"అసెంబ్లీలో మన వ్యూహానికి వైసీపీ ఇబ్బంది పడింది. వర్గీకరణకు అనుకూలమో, వ్యతిరేకమో తేల్చుకోలేకపోయింది. ఆ విధంగా వైసీపీ కుట్రను ఎండగట్టగలిగాం. దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని ఇన్నాళ్లు డిమాండ్ చేసిన ఆ పార్టీ నిన్న అసెంబ్లీలో ఎస్సీ సబ్‌ప్లాన్ బిల్లుకు ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చి ప్రభుత్వా న్ని గద్దె దించే అవకాశమున్నా ఎందుకు వెనుకడుగు వేసింది? ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తాము అవిశ్వాసం పెట్టబోమని చెప్పా రు. జగన్ జైలు నుంచి విడుదలయ్యాక దానిపై ఆలోచిస్తామని మాట్లాడడం వెనుక ఆంతర్యమేమిటి? దీన్ని బట్టే మ్యాచ్‌ఫిక్సింగ్ ఏ రెండు పార్టీల మధ్య ఉందో తెలిసిపోయింది. ఈ విషయాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లండి'' అని కోరారు. కాంగ్రెస్‌లో చేరకపోతే వైసీపీకి భవిష్యత్తు లేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని ఇరు వర్గాల ఓట్లకు దూరం చేయాలన్నారు.