December 3, 2012

ధర్మో రక్షతి రక్షితః

వెయ్యి కిలోమీటర్లు నడిచా! లక్షలమందిని కలిశా! వేల ఆలోచనలు పంచుకున్నా! నా యాత్ర ఉద్దేశం నెరవేరుతున్నట్లే కనిపిస్తోంది! తొమ్మిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని భావించాను. కానీ, ఈ ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తోందో ప్రజలే స్వయంగా వచ్చి నాకు వివరిస్తున్నారు. కన్నీటితో తమ కష్టాలను చెబుతున్నారు. గోడు వెళ్లబోసుకుంటున్నారు. నా పాలనను గుర్తు చేసుకుని, ఈ పాలనతో పోల్చి చూసుకుంటున్నారు.

తొమ్మిదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాను. అంతకుముందు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే హయాముల్లో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో అత్యున్నత పాత్రను పోషించాను. అదంతా ఓ శకం. నా రాజకీయ జీవితంలో ఇప్పుడు చేస్తున్న పాదయాత్ర వాటన్నిటికీ భిన్నమైనది. ఇదో కొత్త అనుభవం.

ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నడూ చూడని కొత్త ధోరణులు వచ్చాయి. అధర్మం ధర్మంగా.. అవినీతి నీతిగా చలామణి అవుతోంది. పత్రికలు, టీవీలు పెట్టుకుని వింత పోకడలు పోతున్నారు. ప్రజలను మభ్యపెట్టడం, అయోమయానికి గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలు వివరించడం నా బాధ్యతగా భావించా. 63 ఏళ్ల వయసులో పాదయాత్ర అనే కఠిన నిర్ణయం తీసుకున్నా.

వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా, ప్రజల్లో ఉన్నందుకు ఉత్సాహంగా ఉంది. మంచి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను అధిగమించి వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేశా. అన్నిటినీ అధిగమించి ముందుకు వెళుతున్నా ధర్మాన్ని రక్షించుకోవాలని, నీతిని కాపాడుకోవాలనే ధ్యేయంతో!! ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా నా యాత్రపైనే చర్చ జరుగుతోంది. ప్రజల్లో చైతన్యమూ పెరుగుతోంది. అందుకే, ఇంకెన్ని ఇబ్బందులు ఎదురైనా అకుంఠిత దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాఛి!