December 3, 2012

లక్ష కోట్లు కాదు.. వెయ్యి లారీల డబ్బు అని చెప్పండి

జనం భాషలో జగన్ పని పట్టండి! నేతలకు చంద్రబాబు క్లాస్

హైదరాబాద్, డిసెంబర్ 3 : అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదని అనుకోవడం సరికాద ని, వారికి అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యమని టీడీఎల్పీ భేటీలో చం ద్రబాబు అభిప్రాయపడ్డారు. జనం భాషలో జగన్ అవినీతిని ఎండగట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నేతలకు ఆయన భాషకు సంబంధించిన కొన్ని మెళుకువలను విప్పిచెప్పారు. "జగన్ లక్ష కోట్లు తిన్నాడని మనం అంటే ఏదో తిన్నాడని అనుకొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కోటి రూపాయలు ఎంతో కూడా తెలియదు. జగన్ దోచుకొన్న డబ్బును వంద రూపాయల్లోకి మారిస్తే అవి వెయ్యి లారీలకు సరిపోతాయని వివరిస్తే బాగా అర్థమవుతుంది. బంగారం ధర ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది. గాలి జనార్దన్‌రెడ్డి వంటివారు గనులు దోచి ఆ డబ్బుతో కిలోలకు కిలోలు బంగారం కొని మూటలు కట్టడం వల్లే దాని ధర విపరీతం గా పెరిగిపోయి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిం ది. నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఇలాంటి విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే వచ్చే స్పందన స్పష్టంగా కనిపించింది.

మీరూ ఇలాంటి విషయాలపై కసరత్తు చేసి ఏది ఎలా చెప్పాలో ఆలోచించండి' అని ఆయన అన్నారు. నడుస్తూ తిరుగుతూ ప్రజల్లోకి వెళ్ళడం వల్ల వారు ఇప్పుడు తాను చెప్పే విషయాలను శ్రద్ధగా వింటున్నారని చెప్పుకొచ్చారు. అనేక ఇబ్బందులను అధిగమిస్తూ చంద్రబాబు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకోవడం పట్ల ఆయనను అభినందిస్తూ సమావేశం తీర్మానం చేసింది. రైతులకు రుణ మాఫీ, పేదలకు పింఛను మొత్తం రూ. ఆరు వందలకు పెంపు, బెల్టు షాపుల ఎత్తివేత వంటి వాగ్దానాలతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ డిక్లరేషన్లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సమావేశం నిర్ణయించింది.