December 17, 2012

వేతన జీవుల సమస్యలపై ఆవేదన:చంద్రబాబు

ఉద్యోగులకు పీఆర్సీ వేయాలి!
పెన్షనర్లకు పింఛన్ పెంచాలి
సర్కారుకు చంద్రబాబు డిమాండ్
అధికారంలోకి వస్తే .. మేమే చేస్తామని భరోసా

ఉద్యోగ సమస్యలపై టీడీపీ అధినేత గొంతెత్తారు. పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత తొలిసారి చంద్రబాబు 'వేతనజీవుల' సమస్యలపై స్పందించారు. " వెంటనే పీఆర్సీ వేయాలి. పెన్షనర్ల పింఛను పెంచాలి'' అని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేదంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే తామే అమలు చేస్తామని తేల్చిచెప్పారు. కరీంనగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఆయన సోమవారం పాదయాత్ర ప్రారంభించారు. రాయికల్, కుమ్మరిపల్లి, ఉప్పుమడుగు, అల్లీపూర్, కిష్టంపేట గ్రామాల వరకు 14.4 కిలోమీటర్లు నడిచారు.

ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు, వికలాంగులు, కూన పులి సంఘం, గంగ పుత్రులు, గీత కార్మికులు, నాయీబ్రాహ్మణులు, మేదరులు, కుమ్మరి, రజకులు, ముస్లింలు, గల్ఫ్ బాధితులు, మహిళలు..ఆయనకు దారి పొడవునా ఘనస్వాగతం పలికారు. గీత కార్మికుల మోకు ధరించి, బట్టలు ఇస్త్రీ చేసి, కుమ్మరి సారె తిప్పి, క్షౌరవం చేసి, రాట్నం వడికి, డప్పు కొట్టి శ్రామిక జనావళితో మమేకమయ్యారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కిరణ్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

"దేశమంతా తిరిగినా నాకు అధికారం రాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెటకారం చేస్తున్నారు. ఈయన, ఈయన మంత్రులు తిరగరు. సమస్యలు పరిష్కరించరు. ఇదో పనికి మాలిన ప్రభుత్వం. దద్దమ్మ ప్రభుత్వం. మాయ మాటలు నమ్మకండి. ప్రలోభాలకు లోను కాకండి. నేను చెప్పింది న్యాయమా కాదా అనేది మీరూ మీ కుటుంబమూ ఆలోచించండి. మీ కుటుంబ పెద్దగా ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తా. ఎన్నికల రోజు నాకివ్వండి.. ఐదు సంవత్సరాలు మీతో ఉండి మీ జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా'' అని చెప్పారు. ఉద్యోగులకు పీఆర్సీ వేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వారికోసం ఆరోగ్యబీమా పథకం అమలుచేయాలని కోరారు.

"ఈ రోజు పెన్షనర్ల రోజు. 30 సంవత్సరాలపాటు వారు నిస్వార్థంగా సేవలందించారు. వారికి ఇస్తున్న పెన్షన్ ఆహార , ఆరోగ్య అవసరాలకు సరిపోవడం లేదు. పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉంది'' అని సూచించారు. అలాగే ఇంటి స్థలం, ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఆరోగ్య కార్డులను జారీ చేయాలని, అధికారంలోకి వస్తే ఆ బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. వృద్ధుల పెన్షన్‌కు రూ. 200 నుంచి రూ. 600లకు తక్కువ గాకుండా పెంచుతామని, వృద్ధులు, వికలాంగులకు ఇళ్ల స్థలాలు, లక్ష రూపాయల చొప్పున వెచ్చించి ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.

బీడీ కార్మికులకు రోజుకు రూ. 150 కనీస వేతనం ఇచ్చేంత వరకు ఈ ప్రభుత్వంతో పోరాడుతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే ఆ వేతనాన్ని అమలు చేస్తామన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పేద పిల్లలకు ఉచిత విద్యనందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కిరణ్ ప్రభుత్వం మొండెద్దు లాంటిదని, దీన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి బంగాళాఖాతంలో పారవేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

" కాంగ్రెస్ అవినీతి పార్టీ, టీఆర్ఎస్ అవకాశవాద పార్టీ, వైసీపీ జైళ్లో ఉండి రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ దొంగలు జైలుకు వెళ్లి దండం పెట్టి వస్తున్నారు. వీరికి కష్టాలు పట్టవు. టీఆర్ఎస్‌కు ప్రజా సమస్యలు పట్టవు. కేసీఆర్ కొడుకు, కుమార్తె, మేనల్లుడికి మాత్రం ఉద్యోగాలు కావాలిగానీ ప్రజలకు వద్దా'' అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండగా కేసీఆర్ బీడీ కట్టలపై శవం, పుర్రె గుర్తును వేయించారని గుర్తుచేశారు. మౌలిక సమస్యలను సైతం ప్రభుత్వం పరిష్కరించక పోవడంతోనే ప్రజలు రోడ్లెక్కారని విమర్శించారు.

పేదలలో, ప్రజలలో ఆర్థిక అసమానతలు తొలగించి జీవన ప్రమాణాలు పెంచడానికి తాను నగదు బదిలీ పథకాన్ని తీసుకురావాలని అనుకున్నానని, అయితే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కేంద్రం..నగదు బదిలీని చేపట్టాలని నిర్ణయించిందని విమర్శించింది. ఇప్పటివరకు 40 శాతం ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు పూర్తి కాలేదని; తొందరపడి అమలు చేస్తే రసాభాస అవుతుందని తెలిపారు. నగదు బదిలీ వల్ల ఆర్థిక అసమానతలు తగ్గాలి కానీ పెరిగే విధంగా ఈ ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. రూపాయి కిలో బియ్యం పథకం ద్వారా నగదు బదిలీ కింద ఐదు రూపాయలిచ్చి రూ.60 భారాన్ని ప్రజలపై మోపనున్నారన్నారు. ఇలాంటి నగదు బదిలీ వల్ల రాష్ట్రంలోని 47 వేల మంది చౌక ధరల డీలర్లు వీధిన పడనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మీరొస్తేనే మాకు బతుకు..
"నేనేం చేయాలి.. మీరే చెప్పండి'' అంటూ సమస్యలను ప్రజల నోటే వింటూ, చంద్రబాబు ముందుకెళుతున్నారు. రాయికల్‌లో తనను కలిసిన యువకులు, విద్యార్థులతో సమస్య- పరిష్కారం చెప్పించారు. "మీ తొమ్మిదేళ్ల పాలన చాలా బా గుంది. అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తొమ్మిది గంటలకే వచ్చి పనిచేశారు. కాంగ్రెసోళ్లు ఏం చేస్తున్నరు? కోట్లు తిన్నారు. జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏం చేస్తున్నారు?'' అని ఒక యువకుడు ఆవేశంగా ప్రశ్నించారు. "మీ సంస్కరణల వల్ల పాలన బాగా సాగింది. సంక్షేమ ఫలాలు అందాయి. మళ్లీ మీరొస్తేనే మాకందరికి బతుకు''అని మరో విద్యార్థి ఆకాంక్షించారు.