December 18, 2012

తెలంగాణపై మా లేఖ కేంద్రం వద్దే ఉంది

నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే
టీడీపీపై బురదచల్లే ప్రయత్నం చేయొద్దు
పనికిమాలిన సీఎం.. ఎక్కడా కనపడడు
జమ్మికుంటలో దీక్ష చేసి తాడో పేడో తేలుస్తాం
గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక శాఖ
కరీంనగర్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

  "తెలంగాణపై నేనిచ్చిన లేఖ కేంద్రప్రభుత్వం వద్దే ఉంది. నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. దీన్ని రాజకీయం చేయొద్దు.. ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దు.. తెలుగుదేశంపై బురదజల్లే ప్రయ త్నం చేయొద్దు.. మమ్మల్ని దెబ్బతీయాలని కుట్రపన్నుతున్నారు.. మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు.. భవిష్యత్తులో నూ వ్యతిరేకం కాము'' అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్రలో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా కిష్టంపేట శివారు నుంచి కండ్లపెల్లి, జగిత్యాల, ధరూర్, రాజారం, నూకపల్లి శివారు వరకు 14 కిలోమీటర్ల పొడవున ఆయన నడిచారు.

కండ్లపెల్లిలో గల్ఫ్ బాధితుల బాధల ను తెలుసుకుని చలించిపోయారు. వారికోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పా టు చేసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగిత్యాల బస్టాండ్ చౌరస్తాలో జరిగిన సభలో మాట్లాడుతూ "నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు.. 2008లోనే తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చాం. 2009లో తెలంగాణ జిల్లాల్లో మొదటి విడత పోలింగ్ పూర్తికాకముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నంద్యాలలో.. టీడీపీకి ఓటేస్తే హైదరాబాద్‌కు వెళ్లడానికి పాస్‌పోర్టు తీసుకోవాలన్నారు. అక్కడ ఆయన మాటలతో, ఇక్కడ టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఓటమి చెందాల్సి వచ్చింది'' అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమస్య తేల్చడం లేదన్నారు.

పనికిమాలిన సీఎం ఎక్కడా కనపడడని.. పత్తి, పసుపు, వరి, చెరుకు రైతులు మద్దతు ధరలు లభించక ఇబ్బందులు పడుతుంటే విశాఖకు వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధైర్యముంటే జగిత్యాలకు వచ్చి సమస్యలను పరిష్కరించాల ని, జమ్మికుంటలో దీక్ష పెట్టి తాడోపేడో తేల్చుకుంటాం.. ఖబడ్దార్ అంటూ ఆయన ముఖ్యమంత్రిని హెచ్చరించారు. టీఆర్ఎస్ కిరికిరి పార్టీ అని, అది వాస్తవాలు చెప్పదని, రాజకీయ లబ్ధి గురించే ఆలోచిస్తుందని విమర్శించారు. అతి త్వరలోనే ఉద్యోగుల కోసం ఒక పాలసీని ప్రకటిస్తామని చెప్పారు.

ఎస్సీలకు 10 వేల కోట్లు, బీసీలకు 50 వేల కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం 12,500 కోట్ల బడ్జెట్ పెడతానని అన్నారు. సామాజిక న్యాయం జరగాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు, మైనార్టీలకు 15 శాతం సీట్లు కేటాయిస్తానని.. టీడీపీకి ఓట్లేసి రాజ్యాధికారం పొందాలని పిలుపునిచ్చారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుచేసి ష్యూరిటీ లేకుండా రుణాలు ఇప్పిస్తానని, ఇమామ్‌లు, మౌజంలకు నెలకు రూ. 5,300 వేతనం ఇప్పిస్తానని, వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను పూర్తిగా ఎత్తివేస్తామని హామీ ఇ చ్చారు. నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ, డెయిరీ రైతులకు న్యా యం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.

2003-04లో తలసరి పన్ను రూ. 2,493 ఉండేదని, ఇప్పుడది రూ. 8,650 అయ్యిందని చెప్పారు. అంటే ఒక్కో కుటుంబంపై రూ. 35 వేల పన్నుల భారం పడుతున్నదన్నారు. బాబు పాదయాత్రతో జగిత్యాల వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, చొప్పదండి, కరీంనగర్ ఎమ్మెల్యేలు ఎల్ రమణ, విజయరమణారావు, సుద్దాల దేవయ్య, గంగుల కమలాకర్, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమావతి, బాబూమోహన్ తదితరులు పాల్గొన్నారు.

పొట్టకూటి కోసం లక్షలు అప్పుచేసి గల్ఫ్ దేశాలకు వెళ్తే, అక్కడ కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు కనీసం శవాన్ని కూడా ఈ ప్రభుత్వం తెప్పించడంలేదని చంద్రబాబు మండిపడ్డారు. కండ్లపెల్లిలో గల్ఫ్ బాధితులతో ఆయన దర్బార్ నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి ఆదుకుంటామన్నారు.

పాదయాత్రకు నేటితో 75 రోజులు
జగిత్యాల: ప్రజల కష్టాలు తెలుసుకుని, వారి కన్నీళ్లు తుడిచి, ఆ బాధ ల్లో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో సరిగ్గా గాంధీ జయంతి రోజున టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించిన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర బుధవారంతో 75రోజులు పూర్తిచేసుకోనుంది.

అక్టోబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా హిందూపూర్ సమీపంలోని సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో మొదలైన ఈ పాదయాత్రలో భాగంగా ఇప్పటివరకు ఆయన అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెద క్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని కరీంనగ ర్ జిల్లాలో నడుస్తున్నారు. వాస్తవానికి బాబు పాదయాత్ర మొదలై ఇప్పటికి 79 రోజులు గడిచినా, మధ్యలో 4 రోజులు విరామం ఇవ్వడంతో బుధవారం నాటి యాత్రతో 75 రోజులు పూర్తికానున్నాయి.

అక్టోబర్ 26న గద్వాలలో వేదిక కూలడంతో బాబు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో 26, 27 రెండు రోజులు, తర్వాత నవంబర్ 2న టీడీపీ నేత ఎర్రన్నాయుడు మరణించడంతో పాదయాత్రకు బ్రేక్ పడింది.